'కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. కోనసీమ నాలుగువైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రమణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల (కోన)ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గోదావరి పాయ అయిన గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ ఉన్నాయి ఈ ప్రాంత ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. 1996వ సంవత్సరంలో కోనసీమలో వచ్చిన తుఫాను పెను నష్టాన్ని కలిగించింది.
మురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి గుడి చాలా నమ్మకం గల ఆలయం. అమలాపురం నుంచి కాకినాడ రూటులో ముమ్మిడివరం తరువాత మురమళ్ళ గ్రామం ఉంది. ప్రధాన రహదారి నుంచి 1/2 కి.మీ. ప్రయాణించి ఈ గుడికి వెళ్ళాలి. ఈ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ సంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సంప్రదాయాలను చూడవచ్చు. అతిథి, అభ్యాగతులను ఆదరించడం, పండుగలను, పబ్బాలను సంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడి వారు కొత్తవారిని ‘‘అండీ, ఆయ్’’ అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు. కోనసీమ గ్రామాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ కనిపిస్తుంది.