ప్రకృతి అందాలకు నెలవు ఈ అనంతగిరి కొండలు. తిరుమలలోని శేషాచల కొండ ఆదిశేషుని తలభాగమని, కర్నూలు జిల్లాలో ఉన్న అహోబిలం కొండలు మధ్యభాగమని.. అనంతగిరి కొండ తోక భాగమని స్థానికులు భావిస్తారు. చుట్టూ కొండలు..ఎటుచూసినా పచ్చటి వాతావరణం. వికారాబాద్‌లో ఉన్న ఈ అనంతగిరులు పర్యాటకులకు సేదతీర్చే ప్రాంతం. హైదరాబాద్‌కు అతి చేరువగా ఉండటంతో వారాంతాల్లో పెద్ద ఎత్తున నగరం నుంచి ఈ ప్రాంతానికి వెళ్లి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటారు. దీనికి తోడు అనంతగిరి కొండల్లో ఉండే మెడిసినల్ ప్లాంట్స్ నుంచి వచ్చే గాలి పీల్చుకోవటం వల్ల రోగాల బారిన పడకుండా ఉంటారని కూడా చెబుతారు. వర్షాకాలంలో ఈ కొండపై నుంచి నీరు ఉస్మాన్ సాగర్, అనంతసాగర్‌కు ప్రవహిస్తాయి. అనంతగిరి తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్ద దట్టడవి. అక్కడే అనంతగిరి దేవాలయం ఉంది. ఈ కొండలు హైదరాబాద్ నుండి ప్రవహిస్తున్న మూసీ నది యొక్క జన్మస్థానం. అనంతగిరి అడవి, అనంతగిరి పద్మనాభస్వామి ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతుంటాయి. అనంత పద్మనాభస్వామి దేవాలయం అనంతగిరి కొండలలో హైదరా బాద్‌  నగరానికి సుమారు 75కి.మీ దూరంలో నిర్మితమైనది. దీనిని 400 సంవత్సరాల క్రితం నిజాం నవాబు నిర్మించాడు. ఈ దేవాలయంలో ప్రధాన దైవం విష్ణువు “అనంత పద్మనాభస్వామి” రూపంలో ఉంటాడు. అందువలన ఈ ప్రాంతానికి అనంతగిరి అని పేరు వచ్చింది. ఇక్కడి పద్మనాభ ఆలయ చరిత్ర దాదాపు 1300 సంవత్సరాల నాటిది. ఈ ప్రాంతమంతా అప్పట్లో దట్టమైన అడవి. స్థలపురాణం కథనాల ప్రకారం అలనాడు కొండలతో ఉన్న ఈ ప్రాంతంలో మహర్షులు తపస్సు చేసుకునేవారు.ముచుకుందుడనే మహర్షి రాక్షసులతో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి వారిని ఓడించాడు. స్వర్గ లోకాధిపతి అయిన దేవేంద్రుడిని కీర్తించి,భూలోకంలో తనకు అలసట తీర్చుకోవడానికి, సుఖంగా నిద్రించడానికి కావాల్సిన ఆహ్లాదకరమైన ప్రశాంత స్థలాన్ని చూపాల్సిందిగా,అంతేకాకుండా తన నిద్రను భంగం చేసినవారు తన తీక్షణమైన చూపులతో భస్మమయ్యేలా వరమివ్వాలని కోరాడు. దేవేంద్రుడు అనంత గిరి గుహలను చూపించగా ఓ గుహను నివాసంగా చేసుకుని ముచుకుందుడు నిద్రపోయాడు.

ముచుకుందుడితో శ్రీకృష్ణుడి పాదాలు కడిగిన జలమే జీవనది అయి నేడు ముచుకుందా నదిగా ప్రసిద్ధి చెందిం దన్న కథనం ప్రచారంలో ఉంది. కాలక్రమేణా మూసీ నదిగా మారింది.ఇక్కడ పుట్టిన మూసీ నది హైదరాబాద్‌ మీదుగా నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తోంది. అనంతగిరికే మకుటాయమానంగా కనిపించే పద్మనాభ స్వామి ఆలయం దిగువ భాగంలోని ఓ నీటి బుగ్గ నుంచి ముచుకుందా నది ప్రవహిస్తోంది. కృష్ణుడు ముచుకుందునకు అనంత పద్మనాభస్వామి రూపంలో దర్శనమివ్వడం వల్ల ఈ ఆలయానికి అనంత పద్మనాభ క్షేత్రంగా పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయం పక్కనే భవనాశిని అని పిలిచే భగీరథ గుండం ఉంది. ఇందులో స్నానం చేస్తే ఆయురారోగ్యాలతో పాటు కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం ప్రజల్లో ఉంది.

సందర్శన వేళలు: ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 6.00గంటల వరకూ

పాండవుల గుట్ట

Previous article

ఉస్మాన్‌సాగర్/గండిపేట

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

More in Ranga Reddy