Belum caves

బెలూం గుహలు కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల  మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. అత్యంత సహజంగా,  అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. దేశ, విదేశీ, స్థానిక పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూం గుహల సొంతం. పొడవైన సొరంగ మార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు బెలూం గుహల ప్రత్యేకత . బెలూం గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని నిపుణుల అభిప్రాయం. క్రీ.పూ. 4,500 సంవత్సరాల ప్రాంతంలో అక్కడ మానవుడు నివసించినట్లు గుహల్లో లభించిన మట్టిపాత్రల ద్వారా తెలుస్తోంది. 1884లో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆంగ్లేయుడు బెలూం గుహల ఉనికి గురించి ప్రస్తావించాడు. 1982లో డేనియల్ జెబోర్ నాయకత్వంలో గుహలకు సంబంధించిన జర్మన్ నిపుణుల బృందం వీటిని సందర్శించి, పరిశీలించింది. బెలూం గుహల ఉనికి గురించి ఈ బృందం ద్వారానే బయటి ప్రపంచానికి ప్రముఖంగా తెలిసిందని చెప్పవచ్చు. ఈ గుహలు భూగర్బంలో 10 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయని కనిపెట్టారు. 2002 ఫిబ్రవరిలో బెలూం గుహలను సందర్శించడానికి ప్రజలను అనుమతించారు. అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను, చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి పరుస్తోంది.

1985లో బెలూం గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరచుకుంది. 1999లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధీనంలోకి వచ్చిన ఈ గుహలలో పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్ల దూరం వరకు సిమెంట్, స్లాబ్ రాళ్ళతో నడవటానికి అనుకూలంగా దారి నిర్మించారు. సహజత్వం ఏ మాత్రం దెబ్బతినకుండా బెలూం గుహల అందాలు ద్విగుణీకృతమయ్యే విధంగా విద్యుత్ దీపాలను అమర్చారు. దిగుడు బావి మాదిరిగా ఉన్న ప్రవేశద్వార రూపురేఖలు పూర్తిగా మార్చేసి, భూమికి 20 మీటర్ల అడుగున ఉన్న గుహల్లోకి వెళ్లేందుకు మెట్లు నిర్మించారు. గుహల లోపల పర్యాటకులు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు లోపలికి గాలిని పంపే ఆక్సిజన్ బ్లోయర్లు ఏర్పాటు చేశారు. గుహల్లోపల ఫౌంటెన్, కృత్రిమ కొలను ఏర్పాటు చేయటంతో, అవి మరింత అందాన్ని సంతరించుకున్నాయి. బెలూం గుహలు విశాఖపట్నం జిల్లాలోని బొర్రా గుహల కంటే పొడవైనవి. వీటిలో పొడవాటి మార్గాలు, విశాలమైన ఛాంబర్లు, మంచినీటి గ్యాలరీలు మొదలైనవి ఉన్నాయి. బెలూం గుహల్లోని క్రీ.పూ. 4500 నాటి పాత్రల అవశేషాలు చూస్తే, వాటి పురాతనతత్వం అర్థమవుతుంది. గుహల పైకప్పు నుంచి కిందికి వేలాడుతున్న స్పటికాల వంటి శిలాకృతులను ‘స్టాలక్ టైట్’ లని, కింది నుంచి మొలుచుకొని వచ్చినట్లు కనపడే ఆకృతులను ‘స్టాలగ్ మైట్’ లని అంటారు.

కర్నూలు నుంచి 112 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఫోన్‌: 93461 51516

 

మంత్రాలయం

Previous article

పరిటాల

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *