భద్రాచలం .. శ్రీరామ దివ్యక్షేత్రం.  తెలంగాణలోని  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, గోదావరి నది దక్షిణ తీరాన ఉన్న ఒక పట్టణం. భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. గోల్కొండ నవాబు అబుల్‌ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్నఉండేవాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను (6 లక్షల రూపాయలు) సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశంలో ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు -చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి చేయించాడు. ఆ సొమ్ము విషయమై తానీషా  గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా,ఆ చెరసాల నుండి తననువిముక్తి చెయ్యాలని రాముణ్ణి ప్రార్థించాడు గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు.ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనే పేరు వచ్చింది.

ఈ దేవాలయంలో సీతా, లక్ష్మణ, హనుమంత  సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూలేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధ రకాల నగలు దేవస్థాన ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠానికి వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచాడు.

దర్శనం వేళలు: ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00వరకూ. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి.8.00 గంటల వరకూ

భద్రాచలంలో దేవస్థానం కాటేజీలతోపాటు..హరిత హోటల్.. పలు ప్రైవేట్ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

 

పర్ణశాల

Previous article

అన్నపురెడ్డిపల్లి దేవాలయం

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

More in Khammam