గండికోట వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలంలో పెన్నా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం. ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణినే గండికోట కొండలని కూడా అంటారు. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు స్పష్టమవుతున్నది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు300 అడుగులకు మించదు. ఇక్కడి లోయ సుందర దృశ్యం వర్ణనాతీతం. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శతృవుదాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, కోట లోపలి వారికి బలమైన, సహజ సిద్ధమైన రక్షణ కవచమేర్పడింది. వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది. కోట ముఖద్వారానికి ఏర్పాటు చేసిన ఎత్తైన కొయ్య తలుపులకు ఇనుప రేకుతో తాపడం చేశారు. తలుపులపై ఇనుప సూది మేకులు కనిపిస్తాయి. కోట ప్రాకారాన్ని ఎర్రటి నున్నని శాణపు రాళ్ళతో నిర్మించారు. కొండ రాతిపై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలున్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. అప్పటి శిథిల శిల్పాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. జామా మసీదును మీర్ జుమ్లా సుంద రంగా నిర్మించాడు. భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరచిన నీటి సదు పాయం ఇక్కడి ప్రత్యేకత.

గతంలో ఈ కోటలో సుందరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానాలు, తోటలు ఉండేవి. పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి. అందమైన లోయలు, ఎటు చూసినా అబ్బురపరిచే కమనీయ దృశ్యాలే ఇక్కడ కన్పిస్తాయి.ఎంతో ఘన చరిత్ర ఈ కోట సొంతం. ఎందరో రాజులు,రాజవంశాల పరాక్రమానికి, నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులకు ఇది నిలువుటద్దం. ఈ కోటను సందర్శిస్తే ఆనాటి రాజుల పౌరుషాలు, యుద్ధాలు, వారి పరిపాలన గుర్తుకు వస్తుంది. జమ్మలమడుగు నుంచి 14 కి.మీ.దూరంలో పెన్నా ఒడ్డున వెలసిన గండికోట ఉన్న ప్రాంతాన్ని గిరి దుర్గం అని పిలిచేవారు. క్రీ.శ. 1123లో ఈ కోటను మొదటి సోమేశ్వర మహారాజుకు సామంతరాజుగా ఉన్న కాకరాజు నిర్మించినట్టు ‘గండికోట కైఫియత్‌’ తెలుపుతోంది. దీని పరిసర ప్రాంతాల్లో 21దేవాలయాలున్నాయి. పడమర, ఉత్తర దిక్కుల్లో పెన్నానది ప్రవహిస్తోంది. కోట నుంచి చూస్తే దాదాపు 300అడుగుల లోతులో 250 అడుగుల వెడల్పుతో పెన్నానది కన్పిస్తుండడం విశేషం. ఇక్కడున్న జామా మసీదు ఎంతో ప్రాచుర్యం పొందింది. మసీదు ప్రాకారం చుట్టూ లోపల 64 గదులు,బయట 32 గదులుండి ఎంతో ఆకర్షిస్తాయి.

 

తాళ్లపాక

Previous article

పుట్టపర్తి

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *