మెదక్ చర్చి

మెదక్ చర్చి

మెదక్ పేరు చెప్పగానే వెంటనే గుర్తుకొచ్చేది అతి పురాతనమైన చర్చి.మెదక్ పట్టణంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ చర్చి అతి సుందరమైన కట్టడం. పర్యాటకులు ఖచ్చితంగా ఈ చర్చిని చూడాల్సిందే.అత్యద్భుతమైన నిర్మాణ శైలి, ఆశ్చర్యం కలిగించే అద్దాల కిటికీలు ఈ చర్చి సొంతం. ఆసియా ఖండంలోనే ఎంతో ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందిన ఈ కెథడ్రల్ చర్చి యూరప్ గోతిక్ శైలిలో నిర్మించారు. ఇటలీ దేశస్తులతో పాటు..భారతదేశంలోని నిర్మాణ రంగ నిపుణులు, కళాకారులు చర్చి నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ చర్చిలో 175 అడుగుల ఎత్తు ఉన్న టవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. టెక్నాలజీ అంతగాలేని రోజుల్లోనే ఈ చర్చిని పూర్తిగా రాళ్లు, డంగు సున్నం ఉపయోగించి 10 సంవత్సరాల పాటు నిర్మించారు. అయినా ఇందులో అడుగడుగునా కళాత్మక నైపుణ్యం పర్యాటకులను అబ్బురపరుస్తుంది. ప్రార్థనా మందిరం పైకప్పును ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. చర్చిలో శబ్దం ప్రతిధ్వనించకుండా నిర్మాణంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. చర్చిలో గ్లాస్ ముక్కలతో రూపొందించిన కిటికీలు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని కళ్లకు కడుతాయి.దేవదారు కర్రతో పక్షిరాజు ఆకారంలో రూపొందించిన బైబిల్ పఠన వేదిక,బాత్ స్టోన్ తో తయారు చేసిన ప్రసంగ వేదిక, ఇటాలియన్ స్టోన్ తో నిర్మించిన వేదిక ఫ్లోరింగ్ ఇలా అన్నీ ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. మెదక్ చర్చిలో ఒకేసారి ఐదువేల మంది దైవారాధన చేసే సౌకర్యం ఉంటుంది. మెదక్ చర్చి సమీపంలోనే ప్యాలెస్ ను తలపించే గోల్ బంగ్లా ఉంది. ఇంగ్లాండ్ లోని ట్రినిటి ప్యాలెస్ తరహాలో నిర్మితమైన ఈ బంగ్లా పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇది పలు సినిమా షూటింగ్ లకు కూడా కేంద్రంగా మారింది. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో మెదక్ జిల్లాలో కరువు సంభవించింది. అప్పుడు మిషనరీ, రెవెరెండ్ చార్లెస్ వాకర్ పోస్నెట్ చర్చి నిర్మాణం తలపెట్టి, ‘‘పనికి ఆహార పథకం’’ ప్రవేశపెట్టాడు గ్రామస్తులు ఎవరైతే చర్చి నిర్మాణంలో పాల్గొంటారో, వారికి ఆహారం ఇవ్వబడుతుంది అని’ ‘‘మెతుకులు’’ అనగా అన్నం, అందుకే ఆ ప్రాంతానికి ‘‘మెదక్’’ అని పేరు వచ్చింది. అలా ఈ చర్చి నిర్మాణం, 1914 నుండి 1924 వరకు కొనసాగింది. ప్రపంచంలో వాటికన్ చర్చి తరువాత, అతి పెద్దదైన ఈ చర్చి రూపకల్పనలో వాస్తుశిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్ కీలక పాత్ర పోషించాడు.

మెదక్ చర్చి హైదరాబాదుకు 100 కి.మీ. దూరంలో ఉంది.

సందర్శన వేళలు: సోమ- నుంచి శని. ఉదయం 7.00 నుంచి సాయంత్రం6.00 గంటల వరకూ, ఆదివారం. ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 7గంటల వరకూ

Similar Posts

Recent Posts

International

Share it