నెల్లూరు జిల్లాలోని నేలపట్టును 1976లో ప్రభుత్వం పక్షుల రక్షిత కేంద్రంగా ప్రకటించింది. ఇది 458.92 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఈ కేంద్రానికి విదేశీ పక్షులు ఏటా చలికాలంలో వేలమైళ్ళు ప్రయాణించి ఆహారం కోసం, సంతానోత్పత్తి కోసం వస్తుంటాయి. పెలికాన్ పక్షులకు దక్షిణాసియాలో ఇదే అతి పెద్ద ఆవాసం. పేరుకు విదేశీ పక్షులే అయినా వాటి జన్మస్థలం నేలపట్టే. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ఉన్న ఈ నేలపట్టు దశాబ్దాల కాలంగా పక్షులకు విడిది కేంద్రంగా ఉంటోంది.పక్షులకు ఆహారమైన చేపలు ఇక్కడ సమృద్దిగా దొరుకుతాయి. అందుకే విదేశీ పక్షులు ప్రతి ఏటా అక్టోబర్ నెల నుంచి నేలపట్టుకు రావటం ప్రారంభిస్తాయి. అప్పటి నుంచి ఆరునెలల పాటు వెదురుపట్టు,బోరులింగలపాడు, శ్రీహరికోట, చింతవరం, మొనపాళెం, మనుబోలు ప్రాంతాల్లో చెట్లపై గూళ్లు కట్టుకుని విడిది ఏర్పాటు చేసుకుంటాయి.

ఫ్లెమింగోలు (సముద్రరామచిలుక), పెలికాన్ (గూడబాతులు),పెయింటెడ్‌స్టార్క్స్ (ఎర్రకాళ్లకొంగలు), ఓపెన్‌బిల్ స్టార్క్స్ (నల్లకాళ్లకొంగ),సీగల్ (సముద్రపు పావురాళ్లు), గ్రేహారన్ (నారాయణపక్షి), నల్లబాతులు,తెల్లబాతులు, పరజలు, తెడ్డుముక్కు కొంగ, నీటికాకులు, చింతవక్క,నత్తగుల్లకొంగ, చుక్కమూతి బాతులు, సూదిమొన బాతులు,నీటికాకులు, స్వాతికొంగలులాంటి అనేక విదేశీ, స్వదేశీ పక్షులు ఇక్కడ దర్శనమిస్తుంటాయి. అక్టోబర్‌లో ఇక్కడకు వచ్చాకే తమ జతను వెతుక్కుంటాయి. గూళ్లు కట్టుకుంటాయి. పిల్లలతో కలిసి ఆరు నెలలకు అంటే సరిగ్గా మార్చి నెలకు తిరిగి తమతమ దేశాలకు పయనం అవుతాయి. నైజీరియా, బర్మా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఖజకిస్థాన్,అంటార్కిటా, నేపాల్, చైనా,థాయ్ లాండ్, శ్రీలంక, హిమాలయాల నుంచి ఇక్కడకు తరలివస్తాయి. మొత్తం 46 రకాల పక్షులు ఇక్కడ విడిది చేస్తుంటాయి. పెలికాన్ రకానికి చెందిన పక్షులకు నేలపట్టు హాట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. విదేశీ అతిథులను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి జనం ఇక్కడకు వస్తుంటారు.

నేలపట్టు గూడబాతు సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇంకా నత్తగుల్లకొంగ, నీటికాకి, తెల్లకంకణాయి, శవరి కొంగ లాంటి అంతరించి పోతున్న జాతులకు కూడా ఇది సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.అక్టోబర్ మొదటి, రెండో వారంలో వచ్చిన పక్షులు మూడో వారంలో గూడుకోసం సామాగ్రిని సంపాదించుకుంటాయి. నాలుగో వారంలో ఆడ,మగ పక్షులు జతకూడతాయి. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో గుడ్లు పెడతాయి. డిసెంబరు రెండు లేదా మూడో వారంలో గుడ్డు నుంచి పిల్లలు బయటికి వస్తాయి. తరువాత పిల్లపక్షులకు తల్లి పక్షులు ఈతకొట్టడం, ఎగరడం, ఆహారాన్ని సంపాదించుకోవడం నేర్పిస్తాయి.

పులికాట్ సరస్సు

Previous article

సోమశిల డ్యామ్

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *