పాండవుల గుట్ట

పాండవుల గుట్ట

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న పాండవుల గుట్టలకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. జిల్లాల పునర్విభజన అనంతరం ఈ ప్రాంతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లింది. కురుక్షేత్ర సమయంలో పాండవుల వైపు పోరాడిన తెలవన అనే తెగ వాళ్ళు ఆక్రమించిన తెలీన రాజ్యంగా ఈ ప్రాంతాన్ని ప్రస్తావించారు. వారు వనవాసకాలంలో నివసించిన లక్క గృహంగా వీటిని పరిగణిస్తారు. ఎక్కువ మట్టుకు సున్నపురాళ్ళతో, అవక్షేపశిలలతో ఏర్పడిన ఈ గుట్టల్లో పొరలు పొరలుగా ఒకదాని మీదొకటి పేర్చినట్టుగా అనేక శిలాకృతులు కన్పిస్తాయి. ఎత్తైన బండరాళ్ళ మధ్య లోతైన అగాధాలతో లోయలు, అడుగడుగునా అబ్బురపరిచేవిధంగా పడిగెలెత్తి నిల్చున్న కొండవాళ్ళు. ఆ కొండగోడలపై అపురూపమైన ప్రాచీన రాతిచిత్రాలు దర్శనం ఇస్తాయి. పాండవుల గుట్టల్లో అన్నీ విశేషాలే. ‘ఎదురు పాండవుల’ గుహలకు కుడిపక్కన వెనక వైపున 5 చోట్ల రాతిచిత్రాల దొనెలతో పాటు ఒకచోట అద్భుతమైన సహజసిద్ధమైన అవిచ్ఛిన్న ‘శిలాతోరణం’ ఉంది. ఒక రాతిగుండులో రెండు నిలువుల ఎత్తున ఈ శిలాతోరణం ఎంతో అందంగా కనిపిస్తున్నది.గొంతెమ్మగుహ కూడా విశేషాలున్న తావు. ఇక్కడి గుహలో చేతిముద్రలు, చిత్రాలు, లిపులున్నాయి. వివిధ చిత్రితశిలాశ్రయాల్లో మాదిరిగానే ఇక్కడ ముదురు ఎరుపురంగులో (కుడి) చేతిముద్రలు ఉన్నాయి.గుహ బయట వీరుల యుద్ధసన్నివేశం చిత్రించబడివుంది.రంగు, గీతలను బట్టి ఈ బొమ్మ చారిత్రకయుగం నాటిదనిపిస్తున్నది.గుహలో ఒక రాతిగో మీద బూడిదవన్నె రంగుతో రాసిన లిపి ఉంది.అట్లాంటి రాతలే ఎరుపురంగులో పంచపాండవుల గుహలో కూడా ఉన్నాయి. లిపిని బట్టి 6,7 శతాబ్దాలనాటివని తోస్తున్నది ఆ రాతలు.

పాండవుల గుట్టలు వరంగల్ జిల్లాకేంద్రానికి 50 కి.మీ దూరంలో ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it