ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
మహబూబ్‌నగర్ జిల్లాలో ఇది ప్రముఖ ప్రాజెక్ట్. కృష్ణా నది తెలంగాణలో ప్రవేశించాక ఈ నదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు జూరాల. ఇది బహుళార్ద సాధక ప్రాజెక్టు. గద్వాలకు 16 కిలోమీటర్ల దూరంలో వున్న ధరూర్ మండలంలోని రేవులపల్లి గ్రామం దగ్గర ఈ ప్రాజెక్టు నిర్మించారు.ఆత్మకూరు నుంచి గద్వాల వెళ్లే రహదారిలో ఆత్మకూరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాజెక్టు సుమారు 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 1981లో నిర్మాణం మొదలై 1996లో పూర్తయిన ఈ ప్రాజెక్టు ద్వారా 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
విద్యుత్ ఉత్పాదనకయ్యే వ్యయంలో సగం కర్ణాటక భరించాల్సి ఉంటుంది.ఈ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా కూడా విలసిల్లుతోంది. జూన్ నుంచి ఆగస్టు వరకూ ప్రాజెక్టు లో నీరు నిండా ఉండే సమయంలో పర్యాటకులు భారీగా తరలివస్తారు. ఆ రోజుల్లో ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ప్రాజెక్టు ప్రాంతం కిక్కిరిస్తుంది. ప్రాజెక్టుకు కొద్ది దూరంలో చంద్రగడ్ కోట, పెద్ద చింతరేవుల ఆంజనేయ స్వామి ఆలయం, పాగుంట వేంకటేశ్వరస్వామి ఆలయం వంటి దర్శనీయ స్థలాలు ఉన్నాయి.