తెలంగాణ కుంభమేళా సమ్మక్క,సారక్కజాతర

తెలంగాణ కుంభమేళా సమ్మక్క,సారక్కజాతర

లక్షలాది మంది భక్తజనం. జంపన్న వాగులో పుణ్యస్నానాలు.నిలువెత్తు బంగారం మొక్కులు. శివసత్తుల్లా ఊగిపోతూ భక్తుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే దృశ్యాలు. 50 గంటలపాటు నిరంతరాయంగా దర్శనాలు. ఇదీ రెండేళ్లకోసారి జరిగే తెలంగాణ కుంభమేళా సమ్మక్క,సారలమ్మ జాతర తీరు. ప్రపంచంలో అతి పెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన సమ్మక్క, సారలమ్మ ఉత్సవం ఎంతో చారిత్రకమైనది.

మేడారం..

సమ్మక్క, సారలమ్మ జాతర జరిగే ప్రధాన ప్రదేశం భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో ఉంది. ఈ పుణ్యకేత్రం గుట్టలు, అడవులు,వాగులు, కుంటలకు ఆలవాలం. రెండు సంవత్సరాలకోసారి మాఘపౌర్ణమికి (ఫిబ్రవరి) ముందు వచ్చే బుధవారం నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. బుధవారం సాయం త్రానికి కన్నెపల్లినుంచి సారలమ్మ,కొండాయిగూడెం నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల (మహబూబ్ నగర్ జిల్లా) నుంచి పగిడిద్దరాజు పడగలు (జెండాలు), అడేరాలు (పవిత్ర వస్తువులు), బండారి మేడారానికి వచ్చి ఆయా దేవతల గద్దెలపై కొలువు తీరతాయి. అదే బుధవారం రాత్రి వడ్డెలు (పూజారులు) మేడారం సమీపంలోని పడిగాపురం గ్రామ పొలిమేరల్లోని వనంగుట్టకు వెళతారు.రాత్రంతా కంక వనాలకు పూజచేసి అర్ధరాత్రి దాటాక దేవతలకు పశుబలి ఇచ్చి కంక చెట్లను కూకటి వేళ్లుసహా పెకిలించుకొని గురువారం ఉదయం సమ్మక గద్దెలవైపు పయనమవుతారు. మార్గమధ్యలో వేలాదిమంది భక్తులు ఆ కంక చెట్ల ఆకులను మహాప్రసాదంగా తెంచు కొంటారు. దాంతో అవి గద్దెలకు చేరుకొనేసరికి ఆకులులేని కట్టెలుగా మిగులుతాయి.వాటిని సమ్మక్క గద్దె దగ్గరున్న చెట్టు దగ్గర పూజించి గద్దెపైకి చేరుస్తారు.ఇదే సమయంలో చిలకలగుట్ట నుంచి పసుపు కుంకుమల భరిణను తీసుకొచ్చి సమ్మక్క గద్దెపై నిలుపుతారు. దాంతో సమ్మక్క మొక్కులు,దర్శనాలు ప్రారంభమవుతాయి. మేడారంలో పారే జంపన్న వాగులో భక్తులు పుణ్యస్నానాలు చేసి తడి గుడ్డలతో సమ్మక్కకు సాష్టాంగ పడుతూ వడ్డెలు కంక వనాన్ని, సమ్మక్క భరిణను తెచ్చే దారిలో పడుకుంటారు. వడ్డెలు తమను తొక్కుకుంటూ సాగి పోవడాన్ని ఆ భక్తులు అదృష్టంగా భావిస్తారు. సంతానంలేని వారికి సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఈ విశ్వాసానికి బలం చేకూర్చే మూలికలు చిలకలగుట్టపై ఉన్నాయని చెబుతారు. అలాంటి మూలికల్లో ఒకటి ‘పాలగడ్డ’. దీన్ని చనుబాలురాని తల్లికి నువ్వు బద్దంత తినిపిస్తే పుష్కలంగా పాలు పడతాయని విశ్వసిస్తారు. గురువారం నుంచి శనివారం వరకు దాదాపు 50 గంటలపాటు నిర్విరామంగా భక్తులు సమ్మక్క, సారలమ్మను గద్దెలవద్ద దర్శించుకుంటారు. కోర్కెలు కోరుకుంటారు. మొక్కులు చెల్లించు కుంటారు. అమ్మల కటాక్షం పొందిన వారు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. కోడెలు కట్టేవారు కోడెలు కడతారు. తలనీలాలు సమర్పించుకునేవారు సమర్పించుకుంటారు. ఒడిబియ్యంతో వచ్చి జంపన్న వాగులో స్నానం చేస్తున్నప్పుడు దేవత ఆవహించేవారూ ఉంటారు. శివసత్తుల్లా ఊగిపోతూ భక్తుల సమస్యలకు సమాధానాలతోపాటు కాలజ్ఞానం చెప్పే దృశ్యాలు కోకొల్లలుగా కనిపిస్తాయి.

ఇక సమీప గ్రామాల నాయకపు గిరిజనులు తమ ఇలవేల్పు లక్ష్మీ దేవరను (అలంక్రుత గుర్రం తల), పాండవులు, కృష్ణమూర్తి తదితర మాస్కులను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి చిలకలగుట్ట దగ్గర,సమ్మక్క గద్దెల ప్రాంగణంలో పూజిస్తుంటారు. మహిళ వేషం వేసుకొని ‘ఆచారవంతులు’ పేరుతో సమ్మక్క, సారలమ్మకు మొక్కులు చెల్లించుకునేవారు ఎందరో. కోళ్లు, మేకలు బలిచ్చేవారు బలిస్తుంటారు.శనివారం సాయత్రం ‘వనప్రవేశం’ పేరిట వడ్డెలు సమ్మక్కను గద్దెమీదనుంచి చిలకలగుట్టకు చేర్చుతారు. డోలి దరువులు, అక్కుం పలుకుల నడుమ రోమాంచితంగా సాగే ఈ ప్రవేశమార్గంలో వేలాది మంది భక్తులు వడ్డెలను తాకడానికి, వారి పాద స్పర్శకు నోచుకోవడానికి పొర్లు దండాలు చేస్తుంటారు. ఇలా సారలమ్మ కన్నెపల్లికి, ఇతర దేవతలు వారివారి గ్రామాలకు చేరుకుంటారు. దీంతో మేడారం జాతర ముగుస్తుంది.స్థానిక కోయ గిరిజనులు మాత్రం తదుపరి వచ్చే బుధ, గురువారాల్లో తిరుగువారం లేదా పదహారు పండుగ నిర్వహిస్తారు.

Similar Posts

Recent Posts

International

Share it