నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ ఉదయగిరి కోటకు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పల్లవులు, చోళులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, ఢిల్లీ సుల్తానులు, చివరకు ఆంగ్లేయులు కూడా ఈ దుర్గాన్ని పాలించినట్లు చారిత్రకాధారాలున్నాయి. చోళుల తర్వాత పల్లవ రాజులు పాలించారని జయదేవుని శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. 1235వ సంవత్సరంలో ఈ ప్రాంతం కాకతీయుల వశమైంది. సంజీవి పర్వతంగా పేరుగాంచిన ఉదయగిరి కొండపై నిర్మితమైన కోట 35 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. అంతేకాదు 365 దేవాలయాలతో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. 1471 నుండి 1488 వరకు ఈ దుర్గం విజయ నగర రాజుల ఆధీనంలో ఉండేదని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తున్నది. శ్రీకృష్ణదేవరాయలు1514వ సంవత్సరంలో జూన్ 9న ఈ దుర్గాన్ని వశపరచుకున్నాడని చారిత్రకాధారం. 1540వ సంవత్సరంలో రాయల అల్లుడు అశీయ రామరాయలు ఉదయగిరి పాలకుడయ్యాడు. 1579లో గోల్కొండ సేనాని ముల్కు ఉదయగిరిని ముట్టడించాడని తెలుస్తున్నది. ఆ విధంగా ఉదయగిరి గోల్కొండ నవాబుల వశమైంది. ఆ తర్వాత ఢిల్లీ చక్రవర్తుల సేనాని మీర్ జుమ్లా దీన్ని 1626లో వశపరచుకొని అక్కడ అనేక మసీదులను నిర్మించి స్థానికంగా వుండే ఒకరికి ఆదిపత్యాన్నిచ్చి ఢిల్లీ వెళ్లి పోయాడు. ముస్లిం పాలకులలో చివరగా సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ ఈ దుర్గాన్ని పాలించాడు. అతను వాడిన ఖడ్గం ఈ నాటికీ ఉదయగిరిలో ఉంది. ఆ తర్వాత ఈ దుర్గం ఆంగ్లేయుల పరమైంది. బ్రిటీష్ పాలనలో డైకన్ దొర కలెక్టరుగా ఉన్నప్పుడు రాజమహల్ సమీ పంలో అద్దాల మేడను ఇంకా అనేక భవనాలను నిర్మించాడు.

ఇలా అనేక రాజులు పాలించిన ఈ ఉదయగిరి దుర్గంలో ఆయా రాజుల కాలంలో నిర్మించిన అనేక కట్టడాలు…ఆలయాలు, మసీదులు ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఉదయగిరి దుర్గం  నెల్లూరుకు సుమారు వంద మైళ్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి3097 మీటర్ల ఎత్తులో ఈ దుర్గం ఉంటుంది. ఇక్కడ ఉండే శిల్పకళా చాతుర్యం, కొండపై నుంచి జాలువారే జలపాతం,,పచ్చదనం..పక్షుల సందడి పర్యాట కులకు వినూత్న అనుభూతిని అందిస్తాయి. దుర్గంపై ఉన్న మసీదులు…రక్షక స్థావరాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. కొండల రాతి పొరల నుంచి వచ్చే నీరే కాలువ ద్వారా ప్రవహించి ఉదయగిరి ప్రజల దాహాన్ని తీరుస్తోంది. ఈ కోన కాలువ నీరు తాగితే అన్ని రకాల జబ్బులు పోతాయని అక్కడి ప్రజల నమ్మకం.

సోమశిల డ్యామ్

Previous article

వెంకటగిరి కోట

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *