ఒంటిమిట్ట

ఒంటిమిట్ట

రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వం శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించే దేవాలయంగా ఒంటిమిట్టను ఎంచుకుంది. అప్పటి నుంచి ఒంటిమిట్టకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఒంటిమిట్ట, వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రం ఏకశిలానగరంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరాముడిని,సీతను లక్ష్మణుడుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో పేర్కొన్నారు. గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది.ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శాతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు. ఇక ఒంటిమిట్టకు ఆ పేరు రావడం వెనుక కథనాలను ఇలా చెబుతారు. ఓ మిట్టపైన ఈ రామాలయం నిర్మించడం వల్ల ఒంటిమిట్ట అని ఈ రామాలయానికి,గ్రామానికి పేరు వచ్చింది. ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ రాముణ్ణి కొలిచి తమ వృత్తిని మానుకుని నిజాయతీగా బతికారని, వారి పేరు మీదుగానే ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని ఇంకొక కథనం కూడా ఉంది.

మిట్టను సంస్కృతంలో శైలమంటారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశైలపురి వాసినని చెప్పుకొన్నాడు. అంతేగాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి,భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులను ఒకే రాతిలో చిత్రించారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే. ఈ గ్రామాన్ని గురించి తొలి తెలుగు యాత్రా చరిత్రయైన ‘కాశీయాత్ర’లో ప్రస్తావనలున్నాయి. రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వా మిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని అందులో పేర్కొన్నారు. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది.

కడపకు 28 కిలోమీటర్ల దూరంలో ఉంది.

దర్శన వేళలు: ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 వరకు

మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు

Similar Posts

Recent Posts

International

Share it