విమానయాన చరిత్రలో ‘దారుణ ఏడాది 2020’
విమానాలు అన్నీ రెక్కలు వాల్చేశాయి. ప్రపంచం అంతా ఎక్కడి సర్వీసులు అక్కడే ఆగిపోయాయి. ఈ సమస్య ఒక్క భారత్ లోనే కాదు..ప్రపంచం అంతటా ఉంది. దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం అయినా..ఎప్పుడు ఏ దేశం అంతర్జాతీయ మార్గాల్లో విమానాలకు అనుమతిస్తుందో తెలియదు. ఇది అంతా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై ఆధారపడి ఉంటుంది. విమానయాన చరిత్రలోనే 2020 ఈ రంగానికి అత్యంత దారుణమైన ఏడాదిగా నిలిచిపోనుంది. ఎందుకంటే ఈ రంగంపై కరోనా వైరస్ చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ రంగం ఈ ఏడాది కరోనా కారణంగా ఏకంగా ఆరు లక్షల ముప్పై వేల కోట్లు (84 బిలియన్ డాలర్లు) నష్టపోయే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (ఐఏటిఏ) ఈ అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా పలు విమానాలు ఇప్పటికీ పార్కింగ్ కే పరిమితం అయ్యాయి. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగం ఆదాయం 838బిలియన్ డాలర్లు ఉండగా..ఇది 2020లో 419 బిలియన్ డాలర్లకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేశారు.
ప్రతి రోజు విమానయాన పరిశ్రమ 230 మిలియన్ డాలర్లు నష్టపోతుందని పేర్కొన్నారు. 2021లో నష్టాలు 100 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుందనే ఐఏటీఏ అంచనా వేసింది. రాబోయే రోజుల్లో బిజినెస్ అందుకునేందుకు ఎయిర్ లైన్స్ లు పోటీలో భాగంగా ధరలు తగ్గించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమయంలో పోటీ మరింత తీవ్రమవుతుందని..ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2021లో ప్రపంచ విమానయాన రంగం ఆదాయం 598 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని లెక్కలేశారు. ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య 2.25 బిలియన్లకు పరిమితం అయ్యే అవకాశం ఉందని అంచనా. ఇది 2021లో మాత్రం 3.38 బిలియన్లకు చేరుతుందని భావిస్తున్నారు.