కొండగట్టు

Update: 2019-04-14 11:55 GMT

ప్రకృతి సుందరమైన కొండపైన సువిశాలమైన ప్రదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం కొలువుదీరి ఉంటుంది. ఆలయానికి దక్షిణంవైపు కొండలరాయుని కోట, గుహలు, బొజ్జపోతన,కొండలరాయుని గుర్రపు డెక్కల గుర్తులు, సీతమ్మ కన్నీటి గుంతలు కొండగట్టులో చూడదగ్గ ప్రదేశాలు. పదహారు స్తంభాలతో కూడిన మండపంలో ఆంజనేయస్వామి, శ్రీ వేంకటేశ్వర, ఆళ్వారుల విగ్రహాలు,లక్ష్మీదేవతామూర్తులు ఉంటాయి. 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ ముఖ్ ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి కొంత భూమిని దానం చేసినట్లుగా చెబుతారు. ఈ దేవాలయానికి సంబంధించి ఓ చరిత్ర ఉంది.కొడిమ్యాల పరగణాలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి గుట్టల్లో తన పశువులను మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయింది.ఆవును వెతికి వేసారిన సంజీవుడు చెట్టు కింద నిద్రపోతుండగా..ఆంజనేయస్వామి కలలోకి వచ్చి కోరంద పొదల్లో వెలసిన తనకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించాలని సూచించి ఆవు జాడ చెప్పాడట.

ఆ వెంటనే కళ్లు తెరిచి చూడగా..ఆవు కన్పించటంతో సంజీవుని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ వెంటనే భక్తిభావంతో ముళ్ల పొదలను తొలగించి స్వామి వారికి చిన్న ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీరాముడు సీత కోసం లంకకు వెళ్లే సమయంలో లక్ష్మణుడు మూర్చిల్లిపోగా ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకుని వస్తుండగా..అందులో నుంచి ఓ ముక్కఊడిపడి కొండగట్టుగా ప్రసిద్ధి చెందిందని మరో కథనం. ఆలయానికి వెళ్లేదారిలో సీతాదేవి ఏడ్చినట్లు చెప్పే కన్నీటి గుంతలు భక్తులు చూడొచ్చు. ఇక్కడ ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పిల్లలు లేని స్త్రీలు 40 రోజుల పాటు నిష్టతో ప్రార్థిస్తే పిల్లలు కలుగుతారని నమ్ముతారు స్థానిక ప్రజలు.

దర్శనవేళలు: ఉదయం 4.00 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండల కేంద్రంలోని ముత్యంపేట గ్రామానికి దాదాపు 35 కి.మీ. దూరంలో ఉంది ఆంజనేయ స్వామి దేవాలయం. ప్రస్తుతం ఇది జగిత్యాల జిల్లాలోకి వచ్చింది.జగిత్యాల నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి అయితే 177 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ పర్యాటక శాఖకు చెందిన హరిత హోటల్ కూడా ఉంది.

Similar News

నగునూరు

ధర్మపురి