అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందినది. శ్రీకాకుళం పట్టణానికి కిలోమీటరు దూరంలో అరసవల్లి గ్రామం ఉంది. సంవత్సరంలో రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయ సంధ్యలో గర్భగుడిలో ఉన్న మూలవిరాట్ పాదాలకు సోకేలా నిర్మితమవటం ఈ ఆలయం ప్రత్యేకత. ఉషాపద్మినీ ఛాయా సమేత శ్రీ నారాయణస్వామిని సూర్య కిరణాలు తాకుతాయి. అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోని మూలవిరాట్ ఆదిత్యుని శిరస్సును స్పృశిస్తాయి. ఆదిత్యుని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు.
ఉత్తరాంధ్రలో ఇది ప్రసిద్ధ దేవాలయం. ఇది దేశంలో గల సూర్యదేవాలయాలలో ప్రాచీనమైనది. పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కశ్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. ఉషోదయ కిరణాలతో సమస్త జీవ కోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవల్లి. ఆ ఆలయంలో భాస్కరుణ్ణి పూజించిన వారు అన్ని కష్టాలూ తొలగి హర్షంతో వెళతారని ప్రసిద్ధి. అందువల్ల ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనే వారని, అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఆ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని స్థల పురాణం చెబుతోంది. ఆలయం తొలుత దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణ ప్రవచనం. చరిత్ర పుటలను తిరగేస్తే అరసవల్లిలోని శ్రీ సూర్య దేవాలయాన్ని కళింగ రాజ్యపాలకులలో తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్రవర్మ క్రీస్తు శకం 545లో నిర్మించినట్టు తెలుస్తోంది.
వైజాగ్ నుంచి అరసవల్లి 118 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.