బీమవరం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పట్టణాలలో ఒకటి.ఇది పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు తర్వాత అతి పెద్ద పట్టణం.ప్రసిద్ధ పంచారామాల్లో ఒకటైన సోమారామం భీమవరంలోనే ఉంది. ఈ పట్టణ పరిసరాలు రొయ్యల/చేపల చెరువులతో వర్ధిల్లుతున్నాయి. ఆ వ్యాపారమే ఈ పట్టణ ముఖ్య ఆదాయ వనరు. అదిగాక రైస్ మిల్లులు,వరి/వ్యవసాయ-సంబంధిత కర్మాగారాలు కూడా ఇక్కడ ఎక్కువ. చుట్టు పక్కలనున్న ఉన్న 150 గ్రామాలకు ఇది వాణిజ్య రాజధానిగా వర్ధిల్లుతున్నది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, వస్త్ర దుకాణాలు, బంగారం కొట్లు, గుళ్లు-గోపురాలు, ఉద్యానవనాలు, భోజన హోటళ్లు మొదలయిన ఎన్నో సదుపాయాలు ఈ పట్టణాన్ని నివాసయోగ్యం గానూ ఆహ్లాదకరంగా మార్చాయి.
పంచారామాల్లో ఒకటైన ఈ భీమవరం సోమేశ్వర స్వామి క్షేత్రం. తూర్పు చాళుక్య రాజైన భీమ క్రీ.శ. 890--–918 సంవత్సరాల మధ్య ఇక్కడ సోమేశ్వర దేవాలయానికి శంకుస్థాపన చేశాడు. ఈ దేవాలయం ఇప్పుడు గునుపూడిలో ఉంది. తూర్పు చాళుక్య రాజైన భీమ పేరు మీద ఈ పట్టణానికి భీమవరం అనే పేరు వచ్చింది. క్రీ.శ.1120–-1130సంవత్సరాల మధ్య పక్కన ఉన్న కోడేరు,ఉండి, పెద్దఅమిరమ్ గ్రామాలకు రహదారి ఏర్పడింది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో బాపూజీ భీమవరం నగరానికి 'రెండవ బార్దొలి' అని బిరుదు ప్రదానం చేశారు.