భువనగిరిలో ఉన్న ఈ కోట కాకతీయుల కాలంలో ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమాదిత్య (ఆరవ) కాలంలో ఏకశిలారాతి గుట్టపై నిర్మితమైంది. అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది. ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది. చరిత్రలో పేర్కొన్న షోడశ జనపదాల్లో అస్మక (అశ్మక, అస్సక, అసక, అళక పేర్లతో)జనపదం ఒకటి. మౌర్యులు (చంద్రగుప్తుడు, అశోకుడు), శాతవాహనులు,ఇక్ష్వాకులు, వాకాటకులు, విష్ణుకుండినులు, రాష్ట్రకూటులు, పశ్చిమ,కళ్యాణి చాళుక్యులు, కందూరిచోడులు, కాకతీయులు, పద్మనాయకులు,బహమనీలు, కుతుబ్షాహీలు, నిజాం రాజులు తెలంగాణానేలిన అందరి పాలనలో భువనగిరి ఉంది. భువనగిరి ఒక చారిత్రక పట్టణం.విష్ణుకుండినుల నాటి నాణేలు భువనగిరిలో దొరికినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు.