స్థానికంగా కోటగుళ్ళు అని పిలవబడుతున్న కాకతీయ కాలం నాటి ఆలయ సముదాయంలో వివిధ పరిమాణాల్లో 22 గుళ్లు ఉన్నాయి. ఈ ఆలయ సము దాయం చుట్టూ రాతిగోడలతో కూడిన ప్రాకారం ఉంది. ఈ ఆలయ సముదాయంలో ప్రధానమైనది, అత్యంత ఆకర్షణీయమైనది గణపేశ్వరాలయం అనే శివాలయం. ఇక్కడ సర్పధారియై ఢమరుకాన్ని వాయిస్తున్న పరమశివుని నిలువెత్తు విగ్రహం చక్కగా చెక్కబడి ఉంది.మరో ప్రధానాకర్షణ సభామండపాలు. ఆలయానికి ఉత్తరవైపున రెండు మదనికలు లేదా సాలభంజికలు ఉన్నాయి. శిథిలమైన నిర్మాణాలతో విస్తరించిన శిల్పాకృతులతో శిథిలావస్థలో ఉన్న ఘనపూర్ దేవాలయం పురాతన వస్తు ప్రదర్శనశాలను గుర్తుకు తెస్తుంది. కాకతీయ రాజు గణపతి దేవుడు 13వ శతాబ్దంలో వీటిని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.బలవంతమైన కాకతీయ సామ్రాజ్యం 1323వ సంవత్సరంలో ఘియాసుద్దీన్ తుగ్లక్‌చే ముట్టడికి గురైంది. ప్రస్తుతం ఈ దేవాలయ సముదాయం ప్రకృతి, కాల నిరాదరణకు మౌనసాక్ష్యంగా కనపడుతోంది. 22 కట్టడాల ఈ సముదాయం చుట్టూ రెండు ప్రాకారాలు నిర్మించారు.
(హైదరాబాద్ నుంచి 118 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
వరంగల్ నుంచి 63 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.)