హుస్సేన్‌ సాగర్‌

Update: 2019-04-18 09:19 GMT

జంట నగరాలైన హైదరాబాద్- సికింద్రాబాద్ లను కలిపేదే హుస్సేన్ సాగర్. అంతే కాదు...ఇది ఓ చారిత్రక పర్యాటక ప్రాంతం కూడా. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలంలో హజ్రత్ హుస్సేన్ షా వలీ నిర్మించాడు. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఈ సరస్సు నగర మంచినీటి, సాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ నదిపై నిర్మించారు. సాగర్ మధ్యలో హైదరాబాద్ నగర చిహ్నంగా ఒక ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని 1992లో ప్రతిష్టించారు. చెరువు తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవటంతో మూసీ నదికి అనుసంధానం చేశారు. కుతుబ్ షా ఈ సరస్సుకు ఇబ్రహీం సాగర్ అని పేరు పెట్టాలని అనుకున్నాడు.

కానీ హుస్సేన్ వలీ కట్టించినందున ప్రజలు ఆయన పేరు మీదుగా హుస్సేన్ సాగర్ చెరువు అని పిలవటం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న సుల్తాను చెరువులకున్న ప్రజాదరణను గమనించి వెంటనే తన పేరు మీద గోల్కొండకు 16 మైళ్ళ దూరంలో ఇబ్రహీంపట్నం చెరువును నిర్మింపజేశాడు. 1568లో హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ గట్టుగా నిర్మించిన రోడ్డును టాంక్ బండ్ అంటారు. వ్యాయామంలో భాగంగా ఉదయం నడక సాగించేవారికి, సాయంకాలం వ్యాహ్యాళికి వెళ్ళేవారికి, స్నేహితులను కలుసుకొనేవారికి ఇది ఒక ఇష్టమైన ప్రత్యేక స్థలం. టాంక్‌బండ్ పక్కనున్న హుస్సేన్ సాగర్‌లో ‘జిబ్రాల్టర్ రాక్’ అనే రాతిపైన ఒక పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలిచిన ఈ విగ్రహం 17.5 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది.

 

 

Similar News

చార్మినార్