గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నియోజవర్గంలోనే ఈ కోటప్పకొండ ఆలయం ఉంది. ఇక్కడ కొలువుదీరిన శివుడిని దక్షిణామూర్తిగా భావిస్తారు. కోటప్పకొండను ప్రభుత్వం అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది.గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించే భక్తులు.. పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. మహాశివరాత్రి సమయంలో అయితే ఈ దేవాలయం కిటకిటలాడుతుంది. కొండమీదకు పోవడానికి నిర్మించిన ఘాట్ రోడ్డులో ప్రకృతి దృశ్యాలు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. కొండపైకి వెళ్లే మార్గంలో జింకలపార్కు కూడా ఉంది. శాసనాల ఆధారంగా ఈ ఆలయం 1172 ఎ.డిలో నిర్మించారు. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురు రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు.
కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600అడుగుల ఎత్తులో ఉంది. ఈ కొండను ఏకోణం నుండి చూసినా మూడుశిఖరాలు కనపడుతుంటాయి అందుకే దీనికి త్రికూటాలయమని పేరు వచ్చింది. అందువల్ల ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తుంటారు. పురాణ కథనాలను అనుసరించి దక్షయజ్ణం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకుతాను చిన్నబాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపమాచరించాడు.సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ణానబోధ చేయాలని కోరాడు. పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడని చెబుతారు.
https://www.youtube.com/watch?v=881MVb7Od8o