తెలంగాణ రాష్ట్రంలో ఎత్తైన జలపాతం ఇదే. సహ్యాద్రి పర్వత పంక్తుల్లో సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతం ఇది. కుంటాలలో 50 అడుగుల ఎత్తు నుంచి పాల నురగలను తలపించేలా పరవళ్లు తొక్కుతూ కిందకు జాలువారే జలసిరులను చూసి పర్యాటకులు ముగ్దులవుతారు.చుట్టుపక్కల ఉండే పచ్చని వాతావరణం..జాలువారే జలపాతాలు పర్యాటకుల సేదతీరుస్తాయి. మహాభారత కాలం నాటి శకుంతల,దుష్యంతులు ఇక్కడే ఉన్నారని పురాణాల్లో చెబుతారు. శకుంతల పేరు మీదుగానే జలపాతానికి కుంటాల జలపాతంగా పేరు వచ్చిందని స్థానికుల కథనం. మహారాష్ట్రలోని బురుకూండం వద్ద జన్మించిన కడెం నది కుంటాల గ్రామంలో జలపాతంగా ఏర్పడింది.
రెండు పాయలుగా విడిపోయి కిందకు దూకే జలపాతం వద్ద లోతు ఎక్కువగా ఉండే మూడు గుండాలు ఉంటాయి.ఎడమ వైపు కిందకు దూకే ధార సమీపంలోనే రాతి గుహ ఉంది. ఇందులో సోమన్న, నంది, శివలింగం విగ్రహాలు ఉన్నాయి.ఏటా శివరాత్రి రోజున ఇక్కడ పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో ప్రకృతి సోయగాలు ఎక్కువగా ఉండటంతో సినీ పరిశ్రమ కూడా ఇటువైపు చూస్తోంది. చారిత్రక చిత్రం రుద్రమదేవి సినిమా షూటింగ్ ను వారం రోజుల పాటు ఇక్కడే చిత్రీకరించారు. దట్టమైన అడవుల గుండా పారే కడెం నది క్రమంగా జలపాతంగా మారి..సందర్శకులకు కనువిందు చేస్తుంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం ఓ మంచి అనుభూతిని మిగుల్చుతుంది.
సందర్శనకు అనువైన సమయం: సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకూ,సమీప పట్టణం: ఆదిలాబాద్, హైదరాబాద్ నుంచి 270 కిలోమీటర్లు