ప్రకృతి ప్రేమికులకు ఇది ఓ సుందర ప్రదేశం. వేలాడే వంతెన. చెరువుకు ఆనుకుని రెస్టారెంట్లు, ఇతర వసతి సౌకర్యాలు. ఇది తొలిసారి చూసిన వారికి అసలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉందా అన్న అనుమానం రాక మానదు. అంత అద్భుతమైన పర్యాటక ప్రదేశం ఈ లక్నవరం చెరువు. ఆహ్లాదకర వాతావరణంలో..కొండల మధ్య..అతి పెద్ద చెరువు... అందులో వేలాడే బ్రిడ్జి. ఓహ్...పర్యాటకులకు వింతైన అనుభూతి ఇస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. 13వ శతాబ్దంలో అప్పటి కాకతీయ రాజులు సాగునీటి అవసరాల కోసం లక్నవరం జలాశయాన్ని నిర్మించారు. దీని నిర్మాణం కోసం కృషి చేసిన అప్పటి సైన్యాధిపతి భార్య లక్కవతి పేరు మీద లక్నవరం ఏర్పడినట్లు చారిత్రక సమాచారం.
ఈ ప్రాంతం అంతా పచ్చటి పొలాలు..కొండల మధ్య ఉండటంతో పాటు...చెరువులో నీరు సమృద్ధిగా ఉండటంతో ఇది ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. వరంగల్ కు వెళ్లిన వారు లక్నవరం చెరువు అందాలు ఆస్వాదించకుండా రారంటే అతిశయోక్తి కాదు.ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్రాంతం పర్యాటకులకు ఎంతో అందమైన అనుభూతులను అందిస్తుంది. లక్నవరం చెరువుకు తొమ్మిది ప్రధాన తూములు ఉన్నాయి. కాంక్రీటు, ఇనుము వాడకం లేకుండా కట్టిన ఈ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరకపోవటం విశేషంగా చెప్పవచ్చు. ఈ సరస్సులో ఆరు దీవులు ఉండగా ఒక్కో దీవిని ఒక్కోరకంగా ముస్తాబు చేసి పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు పర్యాటకశాఖ తగిన ఏర్పాట్లను చేస్తోంది.
(వరంగల్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లక్నవరం చెరువు ఉంది. అక్కడే పర్యాటక శాఖ నిర్వహించే హోటల్ లో బస చేయవచ్చు.)
https://www.youtube.com/watch?v=eG4UyafSbsQ