ఈ పేరు చెప్పగానే పానకాల స్వామే గుర్తుకొస్తాడు. ఎంతో పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఇక్కడ ఉంది. ఇక్కడి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహ స్వామి. కొండపైన ఉన్న దేవుడిని పానకాల స్వామి అని అంటారు. కొండపైన దేవాలయంలో విగ్రహం ఏమీ ఉండదు. కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరుచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం. మంగళగిరి పానకాలస్వామికి ఒక ప్రత్యేకత ఉంది.పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే,అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి తాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదంగా వదిలిపెడతాడని ప్రతీతి.
ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే తాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాలస్వామి అని పిలుస్తారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినది. నాటి ధరణికోట జమిందారు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతితో నిర్మితమైంది. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారిపై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది.
https://www.youtube.com/watch?v=zEju059RnpE