నాగార్జున సాగర్ ప్రాజెక్టు..ఎత్తిపోతల, అనుపు..నాగార్జున కొండ మ్యూజియం ఇక్కడి ప్రధాన సందర్శన ప్రాంతాలు. జలకళ సంతరించుకున్నప్పుడు అయితే ఈ ప్రాజెక్టు దగ్గర పర్యాటకులు బారులు తీరుతారు. సాగర్ నిండి ప్రాజెక్టు గేట్లు ఎత్తితే అది కనువిందే. ఇలాంటి సందర్భం వచ్చిందంటే చాలు అటు హైదరాబాద్ నుంచి ఇటు ఏపీ నుంచి పర్యాటకులు భారీ ఎత్తున క్యూకడతారు. పనిలో పనిగా నాగార్జున కొండ,బోటింగ్ షికారు కూడా పూర్తి చేసుకుంటారు. దేశంలోనే రిజర్వాయర్లలో నాగార్జునసాగర్ రెండవ స్థానంలో ఉంది. పొడవులో మొదటిది ఇదే.నాగార్జునసాగర్ డ్యామ్ ప్రధాన కట్టడం 490 అడుగుల ఎత్తు కలిగి 1.6కిలోమీటర్ల పొడవుతో 26 గేట్లతో ఉంది. ప్రతి గేటు 42 అడుగుల వెడల్పు కలిగి 45 అడుగులు ఎత్తు ఉంటుంది. ఈ సాగర్ ద్వారా నల్గొండ, ఖమ్మం,కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందుతుంది. అంతే కాకుండా ఇక్కడ పెద్ద జల విద్యుత్ కేంద్రం కూడా ఉంది. కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు అతి పెద్దది. ఇది ఒక బహుళార్థసాధక ప్రాజెక్టు. తెలంగాణలో నల్గొండ జిల్లా నందికొండ వద్ద నిర్మించిన ఈ ఆనకట్టను మొదట్లో నందికొండ ప్రాజెక్టు అని పిలిచేవారు. ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు.
నాగార్జునసాగర్ పట్టణం మూడు భాగాలుగా విభజించారు. ఆనకట్టకు దక్షిణాన విజయపురి సౌత్ (వీ.పీ.సౌత్) (గుంటూరు జిల్లా), ఆనకట్ట దాటిన వెంటనే ఉత్తరాన పైలాన్ (నల్గొండ జిల్లా), ఉత్తరాన కొండ మీద హిల్ కాలనీ (నల్గొండ జిల్లా) ఉన్నాయి.నాగార్జునసాగర్ ప్రముఖ బౌద్ధ చారిత్రక స్థలం కూడా. శాతవాహనుల కాలంనాటి శ్రీ పర్వతమే నాగార్జున కొండ. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
జలాశయం నిర్మాణ సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమయిన చారిత్రిక కట్టడాల శిథిలాలను జలాశయం మధ్యలో"నాగార్జున కొండ" అని ఇప్పుడు పిలిచే మ్యూజియంలో భద్రపరిచారు. ఆ మ్యూజియాన్ని నాగార్జునకొండ మ్యూజియం అంటారు. భారతదేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా 1955 డిసెంబరు10 నాడు పునాది రాయి పడింది. భారత దేశ మూడవ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ చేతుల మీదుగా 1967 లో కుడి, ఎడమ కాలవలోనికి నీటి విడుదల జరిగింది. గతంలో ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు, శాతవాహనులు పరిపాలించేవారు. ఆ కాలంలో నిర్మించిన అనేక బౌద్ధ స్థూపాలు ఇతర కట్టడాలు ఈ జలాశయంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. వాటి పరిరక్షణకు వాటిలో చాలా వాటిని యథాతథంగా పెకిలించి జలాశయం మధ్యలో నెలకొని వున్న నాగార్జున కొండపైకి తరలించి అక్కడ వాటిని ఏర్పాటు చేశారు. అక్కడ ఒక మ్యూజియం కూడా నిర్మించి అందులో ఆనాటి అనేక వస్తువులను ప్రదర్శనకు ఉంచారు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోయేందుకు కృష్ణా పెన్నా నదులను అను సంధానించేందుకు ‘‘కృష్ణా-పెన్నార్ ప్రాజెక్ట్’’ను బృహత్తర ప్రణాళికగా తలపెట్టింది. ఇది తెలిసి ముక్త్యాల రాజాగా పిలిచే వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆంధ్ర ప్రాంతంలోని తొమ్మిది జిల్లాలలో ప్రతివూరు తిరిగి (38వేల మైళ్ళు) నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. ఆ సమయంలోనే డా.కె.ఎల్.రావు ద్వారా పూర్వం హైదరాబాదు నవాబు ఆలీయవార్ జంగ్ కృష్ణా నదిపై పరిశోధన చేయించి ప్రణాళికలు తయారు చేయించాడని విన్నారు. అన్వేషించి ఆ రిపోర్టులు సాధించారు. నందికొండ ప్రాజెక్ట్ స్వరూప స్వభావాలు తెలుసుకోవడానికి స్వయంగా క్షేత్రాన్వేషణకు పూనుకున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై మాచర్ల దగ్గర నదీలోయను దర్శించారు. స్వంత ఖర్చుతో నెలనెలా జీతాలు ఇచ్చి మైసూరు ప్రభుత్వ రిటైర్డు ఛీఫ్ ఇంజినీరు నరసింహయ్య, పి.డబ్ల్యు.డి రిటైర్డు ఇంజినీరు గోపాలాచార్యులు ద్వారా అంచనాలు, ప్లానులు తయారు చేయించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముక్త్యాల రాజా కార్యదక్షతకు, దేశ సేవా తత్పరతకు, నిస్వార్ధ సేవా నిరతికి గొప్ప ఉదాహరణ.