ఇవి తూర్పు కనుమలలో ఒక భాగం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఐదు జిల్లాలలో (కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, వైఎస్ఆర్ జిల్లా) ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇవి కృష్ణా , పెన్నా నదులకు మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. వరకు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని నల్లమల అడవులు అని వ్యవహరిస్తారు. ఈ కొండల శ్రేణిని నల్లమల కొండలు అని పిలుస్తారు.
వీటి సగటు ఎత్తు 520 మీటర్లు. భైరానీ కొండ ఎత్తు 929 మీటర్లు, గుండ్లబ్రహ్మేశ్వరం వద్ద ఈ కొండల ఎత్తు 903 మీటర్లు. ఈ రెండు శిఖరాలూ కంభం పట్టణానికి వాయువ్య దిశన ఉన్నాయి. ఇంకా అనేక శిఖరాలు 800 మీటర్ల ఎత్తు గలవి. నల్లమల మధ్యభాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాతంలో పులుల అభయారణ్యం ఉంది. దీనికే రాజీవ్ అభయారణ్యం అని పేరు. ఇది దేశంలోని 19 పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి.