నేలకొండపల్లి

Update: 2019-04-06 13:03 GMT

నేలకొండపల్లి గ్రామం గొప్ప చారిత్రక స్థలం. మహాభారతంతో ముడిపడ్డ కథలొకవైపు, బౌద్ధ అవశేషాల తాలూకు చారిత్రక వాస్తవాలు మరొక వైపు ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత కల్పిస్తున్నాయి. నేలకొండపల్లికి ఒక మైలు దూరంలో విరాటరాజు దిబ్బ, కీచక గుండం అనే స్థలాలు మహాభారత కథతో సంబంధం కలిగి ఉన్నాయి. కీచకుడిని చంపిన తర్వాత పాతిపెట్టిన ప్రాంతం కూడా ఇదే కావడంతో, దీనికి కీచకగుండం అని పేరువచ్చింది.నేలకొండపల్లి అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు భక్త రామదాసు.భద్రాచలంలో శ్రీరామచంద్రుడికి గుడి కట్టించిన పరమభక్తుడు రామదాసు.ఆ భక్త రామదాసు నడయాడిన ఈ ప్రాంతం ఎన్నో వింతలు, విశేషాలకు పెట్టింది పేరు. రామదాసు క్రీ.శ.1664లో భద్రాద్రి రామాలయం కట్టించాడు.అంతకంటే కొన్ని శతాబ్దాల ముందు, అంటే క్రీ.శ.2వ శతాబ్దంలోనే కొండపల్లి బౌద్ధస్తూపం నిర్మాణం జరిగింది. ఆ రోజుల్లో దక్షిణ భారతదేశానికి ఇక్కడ నుంచే బుద్ధ విగ్రహాల పంపిణీ జరిగేది. విగ్రహాల తయారీ కేంద్రం ఇక్కడే ఉండేది. నేలకొండపల్లి అంటే ‘నెలసెండా’ అనే పట్టణం అని, 2వ శతాబ్దంలోనే చరిత్రకారుడు టోలమీ రాసిన ‘ఇండికా’ గ్రంథంలో నేలకొండపల్లి ప్రస్తావన ఉంది.

ఇలా నేలకొండపల్లి చరిత్ర 2వేల సంవత్సరాలదని అర్థమవుతోంది. కీచకవధ గురించి తెలుసుకోవాలంటే మనం పాండవుల వనవాస చరిత్రను గుర్తు చేసుకోవాలి. పాండవులు 12ఏళ్ల వనవాసం తర్వాత అజ్ఞాతవాసం కోసం ఉత్తరభారతం నుంచి దక్షిణభారత ప్రాంతానికి వచ్చారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్ద,విరాట రాజు రాజ్యం ఉంది. ఆ రాజు వద్ద పాండవులు మారువేషంలో పనికి చేరతారు. విరాటరాజు భార్య సుదేక్షణా దేవి తమ్ముడైన కీచకుడు ద్రౌపదిని చెరబట్టేందుకు యత్నించగా భీముడు ఆడవేషంలో వచ్చి కీచకుడిని వధిస్తాడు. ఇక ఇక్కడి బైరాగుల గుట్ట రాళ్ల కిందనే కీచకుడిని సమాధి చేశారని చరిత్ర చెబుతోంది. ముజ్జుగూడెం గ్రామానికి చెందిన కొందరు పండుగల సమయంలో పుట్టమన్ను కోసం తవ్వకాలు జరిపిన సమయంలో అక్కడ అతి పెద్ద బౌద్ధస్తూపం బయటపడింది. క్రీ.శ. 2వ శతాబ్దం నుంచి దాదాపు 1800 ఏళ్ళు అలా మట్టి పొరల్లో దాగి తథాగతుని చరిత్ర చీకట్లోనే ఉండిపోయింది.

https://www.youtube.com/watch?v=hQBuwAo-6UI

Similar News

భద్రాచలం