గత చరిత్రకు ఆనవాళ్లే ఈ కోటలు. ఈ నిర్మల్ కోటకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. 15వ శతాబ్దంలో నిమ్మనాయుడు నిర్మించిన రాజప్రసాదాలు ఇవి. పింజరి గుట్టపై ఉన్న రాజప్రాసాదానికి నాలుగువైపుల నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ కోటలు నిర్మించారు. ఇప్పటికీ నాటివైభవ చిహ్నాలుగా అప్పటి ఉద్యానవనం,ఈతకొలను, శ్యాంగడ్, బత్తీస్ గడ్, దసరాబురుజు కందకాలు కన్పిస్తాయి. అప్పట్లోనే ఎంతో పద్దతిగా డ్రైనేజ్ వ్యవస్థను నిర్వహించినట్లు ఇక్కడి విధానాలు చెబుతున్నాయి. నిర్మల్‌కు చెందిన కొయ్య బొమ్మలు అంతర్జాతీయంగా పేరు దక్కించుకున్నాయి.
దేశ, విదేశాల్లోనూ నిర్మల్ బొమ్మలు, పెయింటింగ్స్ కు మంచి గుర్తింపు..డిమాండ్ ఉంది. 400 సంవత్సరాల క్రితం నిర్మల్‌ను పాలించిన నిమ్మనాయుడు కొయ్య బొమ్మలను తయారుచేసే కళాకారులను తీసుకొచ్చి ఉపాధి కల్పించాడు. అప్పటి నుంచి కొన్ని కుటుంబాలు నగిషీ కళను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. లేపాక్షి ఎంపోరియం ద్వారా ఈ బొమ్మలను అమెరికా, రష్యా, అరేబియా,మలేషియా, ఇరాన్, దుబాయ్, స్విట్జర్లాండ్, సింగపూర్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి,ఖానాపూర్, ఇచ్చోడ అటవీ పరిధిలో పెరిగే పొనికి చెట్ల కలపతో ఈ నిర్మల్ బొమ్మలను తయారు చేస్తారు.