పాపికొండలు

Update: 2019-04-27 05:26 GMT

ఎటువైపు చూసినా ఎత్తైన కొండలు. మధ్యలో నీళ్లు. ఆ నీళ్లలో ప్రయాణం.ఓహ్.. రెండు కళ్ళు చాలవు ఆ ప్రకృతి అందాలు వీక్షించటానికి.ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పాపికొండలు ఓ అద్భుత ప్రదేశం. పాపికొండలు తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాను ఆనుకొని ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి 410 కిలోమీటర్ల దూరంలోను, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోను ఉన్న పాపికొండల ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తింపు పొందింది. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన,రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇక్కడి కొండలు, జలపాతాలతో దీనిని ఆంధ్రా కాశ్మీర్‌గా అభివర్ణించవచ్చు. భధ్రాచలం వద్ద మునివాటం అనే ప్రదేశం దగ్గరలో జల పాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది. పాపికొండల అడవుల్లో పెద్ద పులులు,చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు (గొర్ర గేదెలు), జింకలు,దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, అనేక రకాల కోతులు,ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు,విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు,మొక్కలకు ఇవి నెలవు. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయత తెచ్చి పెడుతుంది. రాజమండ్రి నుండి పాపికొండలకు చేసే లాంచీ ప్రయాణం పర్యాటకులకు మరచిపోలేని అనుభవం. పాపికొండల విహారయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుండి మొదలవుతుంది. అక్కడినుండిపోలవరం, రాజమండ్రి, కూనవరం,పేరంటాల పల్లి మీదుగా సాగుతుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరా సాగర్ ప్రాజెక్టు వల్ల ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవబోతున్నది. పర్యాటకులు రాత్రిళ్లు వెదురు గుడిసెల్లో బస చేసేందుకు వెసులుబాటు ఆ ప్రాంతంలో ఉంటుంది. మధ్యలో క్యాంప్‌ఫైర్‌... గోదారమ్మ ఒడిలో స్నానం.! ఇవి చాలు పాపికొండల ప్రత్యేకతలు వివరించడానికి!

యాంత్రిక జీవనానికి విసిగి వేసారిన ప్రజలకు చక్కటి ఆహ్లాదాన్ని పంచే పాపికొండల నడుమ పడవ ప్రయాణం అద్భుత జ్ఞాపకాలను మిగుల్చుతుంది. ఖమ్మం జిల్లాలోని వి.ఆర్‌.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటలపాటు చుట్టూ చూడచక్కని గిరిజన గ్రామాలు, అందమైన ప్రకృతి నడుమ గోదావరిలో ప్రయాణం మనస్సుని పరవశింపజేస్తుందంటే అతిశయోక్తి కాదు.

బోట్‌ ఛార్జీలు ఒక్కో వ్యక్తికి 1000 మరియు హట్‌ రేట్లు 2500– 3000రూపాయలు

https://www.youtube.com/watch?v=ihJ3qzK4BAI

Similar News

మంగళగిరి

హాయ్‌లాండ్