ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద సరస్సుల్లో పులికాట్ సరస్సు ఒకటి. ఇది ఉప్పునీటి సరస్సు. సముద్రపు నీరు, మంచి నీరు కలగలిసి ఉండటం వల్ల సముద్రపు నీరంత ఉప్పగా ఉండదు. దీని అసలు పేరు ప్రళయ కావేరి.అది పులికాటుగా మారింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు250 చ.కి.మీ. వైశాల్యంలో వ్యాపించి ఉంది. వర్షాకాలంలో ఇది 460చ.కి.మీ. వరకు పెరుగుతుంది. భారతదేశ కోరమాండల్ తీరంలో చిల్కా సరస్సు తర్వాత రెండవ అతిపెద్ద లగూన్. శ్రీహరికోట ద్వీపం పులికాట్ సరస్సును బంగాళా ఖాతం నుండి వేరు చేస్తున్నది. పులికాట్ సరస్సు యొక్క దక్షిణపు ఒడ్డున తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూర్ జిల్లాలో పులికాట్ పట్టణంఉంది. పులికాట్ సరస్సు 60 కిలోమీటర్ల పొడవు, ప్రదేశాన్ని బట్టి 0.2 నుండి 17.5 కిలోమీటర్ల వెడల్పు ఉంది.చిత్తూరుజిల్లాలో శ్రీ కాళహస్తికి 27 కి.మీ. దూరంలో ఉన్న ఈ చెరువు ఎన్నో జాతుల పక్షులకు, ప్రకృతి సంపదకు నిలయం. ఒకటవ శతాబ్దానికి చెందిన ఒక రచయిత రాసిన Periplus of the Erythraean Sea అనే గ్రంథంలో పులికాట్ ను భారతదేశ తూర్పు తీరం వెంట ఉన్న మూడు ఓడరేవుల్లో ఒకటిగా పేర్కొన్నాడు. రెండవ శతాబ్దంలో టాలెమౌసీ పొందుపరిచిన ఓడరేవుల జాబితాలో ఇది కూడా ఉంది.