రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక నగరం. రాజమహేంద్రవరం నగరానికి, ఆర్థిక, సాంఘిక, చారిత్రక,రాజకీయ ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ఈ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అని కూడా అంటారు. రాజమహేంద్రవరం గత పేర్లు రాజమండ్రి, రాజమహేంద్రి. గోదావరి నది పాపి కొండలు దాటిన తరువాత ఇక్కడికి విస్తరించి మైదానంలో ప్రవేశించి కొద్ది మైళ్ళు దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర చీలి డెల్టాగా మారుతుంది. ఈ పుణ్య క్షేత్రంలో పన్నెండేళ్ళకొకసారి పవిత్ర గోదావరి నది పుష్కరాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇది రాజరాజనరేంద్రుడు పరిపాలించిన చారిత్రక స్థలం.అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలోని నగరాల్లో ఇది 7వ స్థానంలో ఉంది.పూర్వం రాజమహేంద్రవరం, రాజమహేంద్రిగా ఉన్న ఈ నగరం పేరు బ్రిటిషు పాలనలో రాజమండ్రిగా రూపాంతరం చెందింది.