పచ్చని పంట పొలాలతో అలరారే గోదావరి నదీ తీరం పవిత్ర పుణ్యక్షేత్రాలకు నెలవు. ఏ గ్రామాన్ని తట్టినా అనేక శైవాలయాలు కనిపిస్తాయి. శివరాత్రి వచ్చిందంటే హరహర మహాదేవ అంటూ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రముఖంగా గుర్తింపు పొందిన దేవాలయాల్లో పంచారామ క్షేత్రాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. రాష్ట్రం మొత్తం మీద పంచారామ క్షేత్రాలు ఐదు ఉండగా, అందులో రెండు పశ్చిమగోదావరి జిల్లాలో ఉండటం ఈ జిల్లా చేసుకున్న పుణ్యఫలంగా పురాణ పురుషులు చెబుతుంటారు. గునుపూడి సోమారామం విశిష్టతను భక్తులు ప్రతి ఏడాది శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘనంగా చెప్పుకొంటారు. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు అందరినీ అనేక విధాలుగా బాధలు పెట్టేవాడు.
ఈ రాక్షసుని బాధలను తట్టుకోలేక అతనిని సంహరించడం కోసం దేవతలు కుమారస్వామిని ప్రార్థించారు. కుమారస్వామి ప్రత్యక్షమై తారకాసురుని మరణం అతను ధరించిన ఉపాసన లింగంలో ఉందని గ్రహించి తన అస్త్రంతో ఉపాసన లింగాన్ని ఛేదిస్తాడు. ఉపాసనలింగం ఐదు ముక్కలై ఆంధ్రపదేశ్‌లో ఐదు ప్రాంతాల్లో పడ్డాయంటారు. అవే నేటి పంచారామక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. గునుపూడిలో సోమారామం,పాలకొల్లులోని క్షీరారామం, ద్రాక్షారామంలోని ద్రాక్షారామం,అమరావతిలోని అమరారామం, సామర్లకోటలో కోమరరామం పంచారామక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. సోమారామాన్ని చంద్రుడు ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ క్షేత్రపాలకుడిగా జనార్దనస్వామిని కొలుస్తారు. గునుపూడి సోమేశ్వర జనార్దనస్వామి ఆలయాన్ని 9వ శతాబ్దంలో చాళుక్య భీముడు నిర్మించినట్టు చెబుతారు.ఆయన సామర్లకోట రాజధానిగా ఉన్న రాజ్యానికి అప్పట్లో ప్రభువుగా ఉండేవారు. సోమారామాన్ని చంద్రుడే ప్రతిష్టించారనడానికి పూజారులు,భక్తులు అనేక ఆధారాలు చూపిస్తుంటారు. ఈ ఆధారాలన్నీ క్షేత్ర మహత్యంగా పేర్కొంటారు. సోమారామంలోని శివలింగం పౌర్ణమినాడు గోధుమరంగులో, అమావాస్య నాడు నలుపురంగులో కనిపిస్తుంటుంది.చంద్రుడు ఈ లింగాన్ని ప్రతిష్టించడం వల్లనే లింగంలో ఈ మార్పులు సంభవిస్తుంటాయని చెబుతుంటారు. సోమేశ్వర దేవాలయానికి మరో ప్రత్యేకత, ప్రాముఖ్యత కూడా ఉన్నాయి. సోమేశ్వరాలయంపై అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది. యావత్ భారతదేశంలోనే శివుని శిరస్సుపై ఉన్న ఆలయం ఇది ఒక్కటేనని దేవాదాయ శాఖ సర్వేలో తేలింది. ఇదొక వింతగా భక్తులు చెబుతుంటారు.
సోమేశ్వర ఆలయం భీమవరానికి రెండు కి.మీ. దూరంలో ఉంటుంది.