నిజామాబాద్ జిల్లాలోని అతి ప్రాచీనమైన దేవాలయాల్లో నీలకంఠేశ్వరాలయం ఒకటి. సువిశాలమైన ప్రాంతంలో ఏక శిలలతో అందంగా చెక్కిన స్తంభాలు, స్తంభాలకు చెక్కిన అలంకారాలు, శిలా స్తంభాలపై రాతి పలకలపై కప్పు ఆసక్తికరంగా ఉంటుంది. మంటపం మధ్యలో శివలింగానికి ఎదురుగా అలసటగా ఆదమరచి నిద్రపోతున్న బసవన్న లేపాక్షి బసవయ్యను పోలి ఉంటాడు. దేవాలయ శిఖరం పూరీ జగన్నాథాలయ శిఖరం మాదిరే ఉంటుంది. ఈ శిఖరం విషయంలో ఓ కథ ప్రచారంలో ఉంది. మాఘమాస శుద్ధ సప్తమిని రథసప్తమి అంటారు. ఆ రోజు శిల్పి శిఖర ప్రతిష్ట చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఆ సమయంలోనే శిల్పి తల్లి అతనికి భోజనం తీసుకుని వచ్చింది. భోజనం ఇచ్చి వెళ్లే సమయంలో వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగాలని శిల్పి తన తల్లికి చెబుతాడు. కానీ తల్లి మాత్రం కొంత దూరం వెళ్లాక వెనక్కి తిరిగి చూస్తుంది. ఈ ఘటనతో ఆమె అక్కడికి అక్కడే మరణిస్తుంది. శిల్పి అదృశ్యం అయ్యాడు. తల్లి సమాధి ఆలయానికి కొద్ది దూరంలో ఉంది.శిల్పి కోరిక మేరకు రథసప్తమి రోజు ఆలయ రథం తల్లి సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తుంది. ఇది ఈ నాటికి అక్కడ ఆచారంగా కొనసాగుతున్నది. ఆలయం ఉత్తరభాగంలో రాతితో కట్టిన కోనేరు ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి శివరాత్రికి..రథసప్తమికి పెద్ద జాతర జరుగుతుంది.