శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఇదొకటి. ఇది పవిత్ర బౌద్ధయాత్రస్థలం. కళింగరాజుల కాలంలో ఈ ప్రాంతంలో బౌద్ధమతం వ్యాప్తిచెందిందని చెబుతారు. శాలిహుండంలో ఎన్నో విలువైన విగ్రహాలు,బౌద్ధస్థూపం, బౌద్ధచైత్యం వెలుగుచూశాయి. పురావస్తు శాఖ ఇక్కడ ఓ మ్యూజియం ఏర్పాటు చేసి, వీటిని అందులో నిక్షిప్తం చేసింది.శాలిహుండం కొండ పక్కనే వంశధార నది ఉంటుంది. అక్కడ నుంచి వీక్షిస్తే వంశధార నది బంగాళాఖాతంలో కలిసే దృశ్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంత వాతావరణం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది.
బౌద్ధ భిక్షువులు ఈ ప్రాంతాల్లో పర్యటించి బౌద్ధాన్ని ప్రచారం చేశారు.అక్కడే నివాసాలు ఏర్పరుచుకుని మతవ్యాప్తి కోసం పనిచేశారని చెబుతారు. బౌద్ధ మతవ్యాప్తికి శాలిహుండం పేరుగాంచింది. 50సంవత్సరాల క్రితం జరిపిన తవ్వకాల్లో పలు చారిత్రక అవశేషాలు,అపురూపమైన శిల్ప సంపద బహిర్గతం అయ్యాయి. ఇందులో అనేక బౌద్ధ విగ్రహాలు, భిక్షువులు వాడే పాత్రలు, మూడు తలలు, ఆరు చేతులు గల ఛాయాదేవి విగ్రహం, మరీచి, ముంజుశ్రీ, జంబాల, జడధారిని, తార విగ్రహాలు దొరికాయి.