పట్టిసం, పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం మండలానికి చెందిన గ్రామం.నిజానికి ఇది ఒక గ్రామంగా లెక్కలలో ఉన్నా ఇది ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం.ఈ క్షేత్రం. కొవ్వూరుకు 25 కి.మీ. దూరంలో ఉంది. చారిత్రకంగానూ,ఆధ్యాత్మికంగానూ విశేషమైన స్థానం కలదీ పట్టిసం. పాపికొండల మధ్య సాగే గోదావరి ఒడ్డున దేవకూట పర్వతంపైన వీరభద్రస్వామివారి ఆలయం, భావనారాయణ స్వామివార్ల ఆలయాలు ఉన్నాయి. తెలుగు సినిమాలలో అత్యదికంగా చిత్రీకరణ జరిగే దేవాలయం ఇది.ఎప్పుడూ సినిమా షూటింగులతో రద్దీగా ఉండే దీన్ని పట్టిసం,పట్టిసంనిధి, పట్టిసీమ అని కూడా పిలుస్తుంటారు. గోదావరి మధ్యనున్న చిన్న లంక మాదిరి ప్రదేశంలో శ్రీ వీరబద్రస్వామి దేవస్థానం ప్రకృతితో సుందరంగా ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఈ తీర్థం లేదా తిరునాళ్ళకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.
పూర్వం దక్ష ప్రజాపతి తాను చేస్తోన్న యజ్ఞానికి తన అల్లుడైన శివుడిని ఆహ్వానించకుండా అవమాన పరుస్తాడు. ఆ విషయమై తండ్రిని నిలదీసిన సతీదేవి, తిరిగి శివుడి దగ్గరికి వెళ్లలేక అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేస్తుంది. దాంతో ఉగ్రుడైన రుద్రుడు. వీరభద్రుడిని సృష్టించి, దక్షుడి తల నరకాలని ఆజ్ఞాపిస్తాడు. శివుడి ఆదేశం మేరకు దక్షుడి యజ్ఞ వాటికపై వీరభద్రుడు విరుచుకుపడతాడు. తన ఆయుధమైన 'పట్టసం' (పొడవైన వంకీ కత్తి)తో దక్షుడి తల నరికి దానిని గోదావరిలో కడిగాడు. ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పట్టసమనీ ‘పట్టిసీమనీ,’ పట్టసాచల క్షేత్రమని పిలుస్తుంటారు.