విజయవాడలోని ‘విక్టోరియా మ్యూజియం’ను విక్టోరియా మహారాణి పాలనా కాలంలో 1887వ సంవత్సరంలో ప్రారంభించారు. దీనికి వందేళ్ళకుపైగా చరిత్రే ఉంది. ఈ మ్యూజియంలో ఆదిమానవులు ఉపయోగించిన ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో బయటపడిన వస్తువులను ఈ మ్యూజియంలో నిక్షిప్తం చేశారు. మ్యూజియంలో మట్టిపాత్రలు, దంతపు ముక్కలు,కళాఖండాలు, శాసనలిపి పలకలు, రాతప్రతులు, కత్తులు, శూలాలు,అంబులు, తుపాకులు, తాళపత్ర గ్రంథాలు, పురాతన నాణాలు పర్యాటకులకు వినూత్న అనుభూతిని మిగుల్చుతాయి. అల్లూరు నుంచి తెచ్చిన బ్రహ్మాండమయిన బుద్ధుని నల్లరాతి (గ్రానైటు) విగ్రహం, ఇంకొక పాలరాతి విగ్రహం ఉన్నాయి. ఇవి మూడు లేదా నాలుగవ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు.