జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో విజయనగరం కోట ఒకటి. విజయనగర రాజవంశీయులు 1713లో ఈ కోటను నిర్మించారు. విజయనగరరాజులకు దక్కిన ఐదు విజయాలకు గుర్తుగా విజయదశమి రోజున ఈ కోట నిర్మాణం ప్రారంభించారు. విజయనామ సంవత్సరం జయ(గురు)వారం దీనికి శంకుస్థాపన చేశారు. అందుకే ఈ పట్టణానికి విజయనగరం అనే పేరువచ్చినట్లు చరిత్ర చెబుతోంది. నాగర్ ఖాన్ ఈకోటను అత్యంత పకడ్బందీగా నిర్మించారు. నాలుగు పక్కల బురుజులు, చుట్టూ కందకాలు.. ప్రహరీతో శత్రువులు సులభంగాలోనికి ప్రవేశించే మార్గం లేకుండా పక్కా ప్రణాళికలతో దీన్ని నిర్మించారు. తర్వాత తర్వాత విజయనగరం కోట ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మారిపోయింది. దీని ప్రాముఖ్యతను గుర్తించిన పర్యాటక శాఖ విజయనగరం కోట పక్కనే ఓ పార్కును అభివృద్ధి చేసింది.