తెలంగాణ నయాగరా ఈ బొగత జలపాతం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ జలపాతం విశేష ప్రాచుర్యం పొందింది. ఎటుచూసినా పచ్చదనం..కొండ కోనల మధ్య నిత్యం నీటి గలగలలతో బొగత జలపాతం తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధి చెందింది. పర్యాటకులను ఈ ప్రాంతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ జలపాతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం కోయవీరపురం సమీపంలో ఉంది. జలపాతాన్ని చూడాలంటే వాహనాలను కొంత దూరంలో ఆపేసి..చిన్నపాటి గుట్టలను..కొండరాళ్లను దాటేసి చేరుకోవాల్సి ఉంటుంది. బొగత జలపాతాన్ని సందర్శించటానికి అనువైన సమయం జూన్ నుంచి నవంబర్ మధ్య కాలం. వారాంతాల్లో హైదరాబాద్ నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లి ప్రకృతి అందాలు చూసి పరవశిస్తున్నారు. బొగత జలపాతం హైదరాబాద్ నుంచి329 కిలోమీటర్లు..భద్రాచలం నుంచి అయితే 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.