‘ఆకాశపు మహారాణి’ ఇక అదృశ్యం

‘ఆకాశపు మహారాణి’ ఇక అదృశ్యం

బోయింగ్ 747 విమానాలకు బ్రిటీష్ ఎయిర్ వేస్ గుడ్ బై

విమానాల్లో ఎన్నో రకాలు. ఒక్కో విమానానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. బోయింగ్ 747 విమానాలు అంటే అత్యంత విశాలవంతమైన బాడీతో కూడిన విహంగాలు ఇవి. అందుకే వీటికి క్వీన్ ఆఫ్ స్కైస్ (ఆకాశపు మహారాణి) అని పేరుంది. విమానయాన రంగంపై కోవిడ్ 19 చూపెట్టిన విధ్వంసకర ప్రభావంతో బ్రిటీష్ ఎయిర్ వేస్ తన దగ్గర ఉన్న అన్ని బోయింగ్ 747 మోడల్ విమానాలకు గుడ్ బై చెబుతోంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. బ్రిటీష్ ఎయిర్ వేస్ తన తొలి 747 విమానాన్ని 1971 ఏప్రిల్ 14న లండన్ నుంచి న్యూయార్క్ కు నడిపింది. అప్పటి నుంచి ఈ విమానాలు బ్రిటీష్ ఎయిర్ వేస్ లో సింహభాగాన్ని ఆక్రమించాయి. దశాబ్దాల అనుబంధంతో పాటు మిలియన్ల కొద్దీ మైల్స్ ప్రయాణించిన ఈ విమానాలను అత్యంత బాధతో పక్కన పెట్టాల్సి వస్తోందని బ్రిటీష్ ఎయిర్ వేస్ వెల్లడించింది.

విమానయాన రంగం 2019 నాటి స్థితికి రావటానికి 2023-24 సంవత్సరం వరకూ పడుతుందని బ్రిటీష్ ఎయిర్ వేస్ అంచనా వేస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు బోయింగ్ 747 ఇతర విమానాలతో పోలిస్తే ఎక్కువ ఇంథనం ఉపయోగిస్తాయి. సహజంగా ఇది ఎయిర్ లైన్స్ ఆర్ధిక పరిస్థితులపై ప్రభావం చూపించే అంశమే. దూర ప్రాంత ప్రయాణాలకు అనువైన అత్యాధునిక సౌకర్యాలతోకూడిన కొత్త ఏ 350లు, 32 787 విమానాలను బ్రిటీష్ ఎయిర్ వేస్ సమకూర్చుకుంది. ఇవి బోయింగ్ 747 తో పోలిస్తే 25 శాతం తక్కువ ఇంథనాన్ని ఉపయోగిస్తాయని తెలిపారు. 747 బోయింగ్ లను ఉపసంహరించుకోవటం ఎంతో బాధాకరం అయినా తప్పటం లేదని బ్రిటీష్ ఎయిర్ వేస్ ప్రకటించింది.

Similar Posts

Recent Posts

International

Share it