దుబాయ్ పేరు  చెప్పగానే గుర్తొచ్చే కట్టడం బుర్జ్ ఖలీఫానే. దుబాయ్ ను సందర్శించే పర్యాటకులు ఎవరైనా ప్రపంచంలోనే అత్యంత  ఎత్తైన ఈ కట్టడాన్ని సందర్శించకుండా రారంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. బుర్జ్ ఖలీఫా ఎత్తు 828 మీటర్లు. ఈ ప్రతిష్టాత్మక బుర్జ్ ఖలీఫా నిర్మాణం 2004లో  మొదలై  2010 నాటికి అందుబాటులోకి వచ్చింది. ఎమ్మార్ డెవలపర్స్ ఈ బుర్జ్ ఖలీఫాను నిర్మించింది.  బుర్జ్ ఖలీఫాను ఆనుకుని ఉండే ఫౌంటేన్ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బుర్జ్ ఖలీఫాలోని 124వ అంతస్థులో ఉన్న  ‘ఎట్ ద టాప్’ పేరుతో ఉన్న అబ్జర్వేషన్ డెక్ నుంచి దుబాయ్ అందాలను వీక్షించవచ్చు. ఎట్ ద టాప్ స్కై లెవల్ అంటే 148 అంతస్థు నుంచి కూడా దుబాయ్ ను వీక్షించవచ్చు. ఈ లెవల్ ను బట్టి టిక్కెట్ రేట్లలో కూడా మార్పులు ఉంటాయి. బుర్జ్ ఖలీఫాను సందర్శించాలంటే ఖచ్చితంగా టికెట్ కొనుగోలు చేయాల్సిందే. దుబాయ్ కరెన్సీ ఏఈడి. అంటే అరబ్ ఏమిరేట్స్ దిర్హమ్.  బుర్జ్ ఖలీఫాకు అనుబంధంగానే ‘దుబాయ్ మాల్’ ఉంటుంది. ఈ మాల్ లోని  షాప్ లను చూసేందుకు ఒక్క రోజు అంతా గడిపినా సాధ్యం కాదు. అంత పెద్దగా ఉంటుంది మరి ఆ షాపింగ్ మాల్.

మొత్తం ఈ బుర్జ్ ఖలీఫాలో 162 అంతస్థులు ఉంటాయి. తొలుత దీన్ని బుర్జ్ దుబాయ్ గా పిలిచేవారు. తర్వాత బుర్జ్ ఖలీఫాగా మారింది. ఆయిల్ పై ఆధారపడిన ఆర్ధిక వ్యవస్థను పర్యాటక రంగం వైపు మరల్చాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ఈ కట్టడం వచ్చింది. 2007-10 సంవత్సరాల మధ్య కాలంలో తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోవటంతో దుబాయ్ వివిధ రంగాల్లోకి విస్తరించాలని నిర్ణయించుకుని పర్యాటకంపై కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ఈ రంగం ద్వారా దుబాయ్  కు వచ్చే ఆదాయంలో పర్యాటకం వాటా కూడా గణనీయంగా ఉంటుందని చెప్పొచ్చు.

మంగళగిరి

Previous article

దుబాయ్ మిరాకిల్ గార్డెన్ అందాలు అద్భుతం

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *