ఎయిర్ లైన్స్ కు ‘బుకింగ్ జోష్’
దేశీయ విమానయానం గాడిన పడుతోంది. మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కాగా..సర్వీసులు ప్రారంభం అయిన తొలి వారం మాత్రం ప్రయాణికుల స్పందన చాలా తక్కువగా ఉంది. కానీ మే చివరి వారంతో పోలిస్తే జూన్ లో విమానయానం జోరందుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పలు సెక్టార్లలో బుకింగ్ జోష్ లో సాగుతోందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని అతి పెద్ద ఎయిర్ లైన్స్ అయిన ఇండిగో పలు సెక్టార్లలో ఓవర్ బుకింగ్ తో సాగుతోంది. కరోనా భయంతో విమాన ప్రయాణికులు వస్తారా లేదా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. కానీ జూన్ నెలలో మాత్రం పరిస్థితి మెరుగైందని తెలిపారు. మెట్రో నగరాలకు ఇండిగో నిర్వహిస్తున్న విమానాలు అన్నీ ఫుల్ బుకింగ్స్ తో సాగుతోందని ఏవియేషన్ శాఖ వర్గాలు తెలిపాయి.
దీంతోపాటు పట్నా, కొచ్చిన్, రాంచీ, భువనేశ్వర్ లకు కూడా బుకింగ్స్ నిలకడగా ఉన్నాయి. మే నెల చివరి వారంతో పోలిస్తే జూన్ లో బుకింగ్స్ 40 నుంచి 45 శాతం మేర పెరిగాయి. ఢిల్లీ-ముంబయ్, ఢిల్లీ-బెంగుళూరు, ముంబయ్-అహ్మదాబాద్, ముంబయ్-కోల్ కతా రూట్లలో మేతో పోలిస్తే బుకింగ్స్ 22 నుంచి 30 శాతం మేర పెరిగాయి. దేశీయ విమాన సర్వీసులు స్థిరంగా, నిలకడగా ముందుకు సాగుతున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు. హైదరాబాద్ నుంచి కూడా విమాన సర్వీసుల సంఖ్య పెరగటంతోపాటు ప్రయాణికులు కూడా పెరిగారు. అయితే పలు రాష్ట్రాల్లో విమాన ప్రయాణికులపై ఉన్న క్వారంటైన్ ఆంక్షలు పరిశ్రమకు ఒకింత ఇబ్బందికరంగా మారాయి.