ద్రాక్షారామం
ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలానికి చెందిన పట్టణం. కాకినాడకు 32 కి.మీ దూరంలో, రాజమండ్రికి 60కి.మీ దూరంలో ఉంది. ద్రాక్షారామంలో గల శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్దాల మధ్య తూర్పు చాళక్యుల వంశానికి చెందిన చాళక్య భీముడు నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది.ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం.
ఈయన దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు. అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసియున్నది. తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగమనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా, మరొకటి శ్రీశైలం. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్తాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా,వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది. శిల్ప కళాభిరామమై, శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం అలలారుతోంది.