జులై 7 నుంచి పర్యాటకులకు గేట్లు తెరిచిన దుబాయ్
దుబాయ్ కీలక ప్రకటన చేసింది. జులై 7 నుంచి విదేశీ పర్యాటకులను దేశంలోకి అనుమతించనుంది. దుబాయ్ ఆదాయంలో పర్యాటక రంగం వాటా గణనీయంగా ఉంటుందనే విషయం తెలిసిందే. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోట్ల సంఖ్యలో పర్యాటకులు దుబాయ్ ను సందర్శిస్తుంటారు. కరోనా కారణంగా పర్యాటకం పూర్తిగా పడకేసిన విషయం విదితమే. ఇంకా పలు దేశాల్లో కరోనా కేసులు పెద్ద ఎత్తున ఉన్నా కూడా అన్ని దేశాలు ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు క్రమక్రమంగా చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే దుబాయ్ కూడా పర్యాటకులకు గేట్లు ఎత్తేసింది. అయితే దుబాయ్ సందర్శించాలనుకునే పర్యాటకుడు విధిగా కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదంటే దుబాయ్ విమానాశ్రయంలో కోవిడ్ 19 పరీక్ష చేస్తారు. ప్రయాణికుడు తన ప్రయాణ తేదీ కంటే నాలుగు రోజుల ముందు పాలిమరైజ్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దుబాయ్ విమానాశ్రయంలో తాను వైరస్ ప్రభావానికి లోనుకాలేదని సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది.
ఇలా చూపించని వారికి దుబాయ్ లో టెస్ట్ చేస్తారు. దేశంలోకి ప్రవేశించటానికి సరైన ఆరోగ్య భీమా కలిగి ఉండాలి. ప్రయాణికుడు విమానం ఎక్కే ముందు హెల్త్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు భారత్ లో ఉన్న ఆరోగ్యసేతు యాప్ తరహాలో దుబాయ్ ప్రయాణికులు కూడా కోవిడ్-19 డీఎక్స్ బి యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఆరోగ్య అధికారులకు సహకరించాల్సి ఉంటుంది. ఎవరికైనా కోవిడ్ 19 లక్షణాలు ఉంటే ఆయా ఎయిర్ లైన్స్ ప్రయాణికుడి బోర్డింగ్ ను తిరస్కరించే అధికారాలు కలిగి ఉంటాయి. పర్యాటకులు ఎవరికైనా కోవిడ్ 19 లక్షణాలు ఉంటే వారు సొంత ఖర్చుతో ప్రభుత్వం సమకూర్చే 14 రోజుల సంస్థాగత క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుందని తాజా ప్రకటనలో వెల్లడించారు. ఇఫ్పటివరకూ చూస్తే విదేశీ పర్యాటకులకు గేట్లు తెరిచిన తొలి దేశం దుబాయ్ మాత్రమే.