జులై 2 నుంచి దేశీయ పర్యాటకులకు గోవా అనుమతి
గోవా దేశీయ పర్యాటకులకు గేట్లు తెరిచింది. దేశంలోనే అత్యధిక బీచ్ లతోపాటు..పర్యాటకానికి ఎంతో పేరుగాంచిన ఈ ప్రాంతం జులై 2 నుంచి దేశీయ పర్యాటకులను అనుమతించనుంది. ఈ మేరకు గోవా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా గోవాలో 250 హోటళ్ళకు అనుమతించినట్లు గోవా పర్యాటక శాఖ మంత్రి మనోహర్ అజ్నోంకర్ వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అనుమతి పొందిన హోటళ్ళు ప్రామాణిక నిర్వహణ మార్గదర్శకాలు (ఎస్ వోపీ) పాటించాల్సి ఉంటుందని తెలిపారు. కొన్ని నిబంధనల మేరకు పర్యాటకులను గోవాలోకి అనుమతించనున్నారు.
పర్యాటకులు ముందుగానే గోవా పర్యాటక శాఖ అనుమతి ఇచ్చిన హోటళ్ళను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్యాటకులు కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదంటే సరిహద్దులోనే కోవిడ్ టెస్ట్ నిర్వహిస్తారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కావాలంటే సొంత రాష్ట్రం వెళ్ళటానికి అనుమతిస్తారు. లేదంటే గోవాలోనే ప్రభుత్వ నిబంధనల ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుంది. కరోనా వైరస్ వెలుగుచూసిన తర్వాత ఈ ఏడాది మార్చి నుంచి గోవాలో పర్యాటక రంగాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే.