భారత్ నుంచి తొలి అంతర్జాతీయ విమాన సర్వీసులు మాల్దీవులకు!

భారత్ నుంచి తొలి  అంతర్జాతీయ విమాన సర్వీసులు మాల్దీవులకు!

విదేశాలు ఒక్కొక్కటిగా పర్యాటకాలకు గేట్లు తెరుస్తున్నాయి. ఇఫ్పటికే దుబాయ్ విదేశీ పర్యాటకులను అనుమతించింది. జులై 15 నుంచి మాల్దీవులు కూడా విదేశీ పర్యాటకులను ఆహ్వానిస్తోంది. అయితే భారత్ నుంచి తొలి అంతర్జాతీయ విమాన సర్వీసులు మాల్దీవులకు ఉండే అవకాశం ఉందని సమాచారం. దీనికి కారణం ఇప్పటికే మాల్దీవుల ప్రభుత్వం భారత్ కు లేఖ రాసి పర్యాటకుల కోసం ప్రత్యేక విమానాలు నడపాలని కోరింది. ఈ లేఖపై భారత్ కూడా రెండు, మూడు రోజుల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి భారత్ జులై 31 వరకూ అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆగస్టు నుంచి పలు దేశాలకు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. ఓ వైపు కరోనా ఉధృతి తగ్గకపోయినా సరే పలు దేశాలు మాత్రం క్రమక్రమంగా పర్యాటకానికి పలు ఆంక్షల మధ్య గేట్లు తెరుస్తున్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనది కోవిడ్ 19 పరీక్షలు చేసుకుని నెగిటివ్ ఉన్న వారిని మాత్రమే తమ తమ దేశాల్లోకి అనుమతించాలని నిర్ణయిస్తున్నాయి.

రాబోయే రోజుల్లో ఇదే మోడల్ ను అన్ని దేశాలు ఫాలో అయ్యే అవకాశం ఉంది. మాల్దీవులు అతి తక్కువ కరోనా రిస్క్ ఉన్న దేశంగా భావిస్తున్నారు. దీంతో విమాన సర్వీసులు ప్రారంభం అయితే చాలు బడాబాబులు చాలా మంది అటువైపు క్యూ కట్టే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఆ దేశ జీడీపీలో 70 శాతం ఆదాయం పర్యాటకం ద్వారానే వస్తుంది. మాల్దీవుల కోరిక మేరకు దేశంలోని ఎంపిక చేసిన విమానాశ్రయాల నుంచి పరిమిత సంఖ్యలో భారత్ విమానాలు నడిపేందుకు అనుమతించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. భారత్ నుంచి వెళ్లే పర్యాటకులకు వీసా ఆన్ అరైవల్ వెసులుబాటు కల్పిస్తున్న దేశాల్లోమాల్దీవులు కూడా ఒకటి. మాల్దీవుల్లో దిగినప్పుడు ఎవరికైనా లక్షణాలు ఉంటే టెస్ట్ చేస్తారు తప్ప..మిగిలిన వారికి టెస్ట్ లు తప్పనిసరి కాదు.

Similar Posts

Recent Posts

International

Share it