ఆగస్టులోపే అంతర్జాతీయ విమాన సర్వీసులు
‘కొంత మంది అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆగస్టులో ప్రారంభం అవుతాయని..మరి కొంత మంది సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతాయని చెబుతున్నారు. కానీ ఆగస్టు కంటే ముందే ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లలో విమానాలు నడుపుతాం’ అని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. అయితే ఇప్పటికిప్పుడు ఎప్పటినుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం అవుతాయని తేదీ మాత్రం తాను చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆయా దేశాల్లో పరిస్థితులను బట్టి అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు దశల వారీగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసుల అంశం తెరపైకి వచ్చింది. పలు దేశాల్లో కూడా కోవిడ్ 19 కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నందున ఆయా దేశాల్లో పరిస్థితిని మదింపు చేసిన తర్వాతే స్వీసులు ప్రారంభించాల్సి ఉంటుందని చెబుతున్నారు. భారత్ లో లాక్ డౌన్ మే 31తో ముగియనుంది. మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తారా? లేక ఇదే చివరిదా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది. అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రారంభోత్సవానికి ఇది కూడా కీలకం కానుందని చెబుతున్నారు.