కాళేశ్వరం
ప్రాణహిత..గోదావరి నదుల సంగమం వద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఆలయం వెలసింది. ఏకపీఠంపైన రెండు శివలింగాలు ప్రతిష్టించి ఉండటం శ్రీ ముక్తేశ్వరస్వామి దేవాలయం ప్రత్యేకతగా చెబుతారు. అసలు కాళేశ్వరానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?. ఒకే పానవట్టంపై కాలుడు (యమధర్మరాజు), ఈశ్వరుడు (శంకరుడు)వెలిసినందునే ఈ ప్రాంతానికి కాలేశ్వరం అనే పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. యముని పేరిట వెలిసిన ఏకైక శైవ క్షేత్రం ఇదే. ఇక్కడ పాపాలు హరించే యమకోణం, యమగుండం ఉన్నాయి.త్రిలింగమనే మూడు సుప్రసిద్ధమైన శైవ క్షేత్రాల్లో కాళేశ్వరం కూడా ఒకటి.త్రిలింగాల నడుమన ఉండే ప్రాంతం కనుకే త్రిలింగమనే పదం నుంచి తెలుగు అనే పదం పుట్టిందని కొందరు పండితుల భావన. ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో మహాపుణ్యక్షేత్రంగా పేరుగాంచింది కాళేశ్వరం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతంలో గోదావరి నది ఒడ్డున నెలకొని ఉంది.
భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానవట్టం మీద ఒకే లింగం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం విశేషం. ఒకటి కాళేశ్వరలింగం, రెండవది ముక్తీశ్వర లింగం. ముక్తీశ్వర లింగానికి రెండు నాశికా రంధ్రాలున్నాయి. ఆ రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రాదు. త్రివేణి సంగమ తీరంలో ఆ నీరు కలుస్తుందని చారిత్రకాధారాల వల్ల తెలుస్తుంది. ఒకప్పుడు గోవిందరావు అనే కలెక్టరు ఒక ప్రయోగం చేశారని చెబుతారు. ఈ నాశికా రంధ్రాలలో నీరుపోస్తే త్రివేణీ సంగమ తీరంలో కలిసింది, లేనిదీ కనిపెట్టడం కష్టమని వెయ్యి బిందెల పాలు పోశారు. పాలు తెల్లగా ఉండటంతో త్రివేణి సంగమ తీరాన చూడగా పాలు కనబడినట్లు గ్రామస్థులు చెబుతుంటారు. ఈ క్షేత్రం కాశీక్షేత్రం కంటే గొప్పదని 'కాళేశ్వర ఖండవలు' ద్వారా తెలుస్తున్నది. ఈ క్షేత్రం గురించి స్కాందపురాణం, గౌతమీపురాణంలో కూడా పేర్కొన్నారు.ఈ దేవాలయంలోని కాళేశ్వరునికి ముందు పూజచేసి, అనంతరం ముక్తీశ్వరుని పూజిస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.
హైదరాబాద్ నుంచి 264 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
సందర్శన వేళలు: ఉదయం 4.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00వరకు
సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకూ