చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన గ్రామం ఈ కాణిపాకం. ఈ పుణ్యక్షేత్రం బాహుధా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-–బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. కాణిపాకం అంటే ప్రముఖ వినాయక (గణేష్) దేవాలయం. వినాయక ఆలయంతో పాటు కాణిపాకంలో అనేక ప్రాచీన దేవాలయాలున్నాయి.ఇక్కడ జనమేజయుడు  కట్టించాడని చెప్పే ఒక పాత దేవాలయం ఉంది.మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు. ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొంటారు. ఇటీవలి కాలంలో వరసిద్ధి వినాయకుని ఆలయం ప్రశస్తి పొందింది. కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్థం. చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు. వారికి వున్న కొద్ది పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు.పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు. ముగ్గురిలో ఒకరు కింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు.ఇలావుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా తవ్వటం మొదలు పెట్టాడు.కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్థం తగలటంతో ఆపి కింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేష్టుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది.

ఈ మహిమతో ముగ్గురి అవిటితనం పూర్తిగాపోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు.ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్థులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు తవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. కాణిపాకంలో సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి ఇలా వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటాడు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల నాటి వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు.ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలున్నాయి.

 

చంద్రగిరి కోట

Previous article

శ్రీకాళహస్తి

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *