కీసర
కీసర. ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయానికి ప్రసిద్ధి. "మహాశివరాత్రి" పండుగ రోజు శివుడిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలలనుండి భక్తులు భారీగా వస్తారు. త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరాముడు సీతాదేవి, హనుమంతునితో వన విహారానికి వచ్చి, ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆనందభరితుడై ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి నిశ్చయించారు. ఈ విషయమై అరణ్య ప్రాంతంలోని మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి శివలింగ ప్రతిష్ఠాపన కోసం సుముహూర్తాన్ని నిర్ణయించారు. అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని కాశీ క్షేత్రానికి వెళ్లి గొప్ప శివలింగాన్ని తీసుకొని రావలసినదని ఆజ్ఞాపిస్తాడు. ఆంజనేయుడు ఆకాశమార్గాన కాశీక్షేత్రానికి వెళ్ళగా, ఈశ్వరుడు నూటొక్క శివలింగాల రూపంలో దర్శనమిచ్చాడు. ఆయన పరమేశ్వరుని ప్రార్థించి నూటొక్క శివలింగాలను తీసుకొని బయలుదేరాడు. ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహూర్తం సమీపిస్తుండగా శ్రీరాముడు పరమేశ్వరుని ప్రార్థించాడు. ముహూర్త సమయానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపాన్ని ధరించాడు.
శ్రీసీతారామచంద్రులు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకించారు. అందువలన ఈ స్వామికి "శ్రీరామలింగేశ్వరస్వామి" అని పేరు వచ్చింది. తరువాత హనుమంతుడు 101 శివలింగాలను తీసుకువచ్చి, అప్పటికే ప్రతిష్ఠ జరగడంతో ఆవేశముతో తాను తెచ్చిన శివలింగాలను తోకతో విసిరివేస్తాడు. ఆ శివలింగాలన్నీ పరిసర ప్రాంతాలలో అక్కడక్కడా పడిపోయాయి. కీసరలోని కొండపై ఆ దృశ్యాలను ఇఫ్పటికీ చూడొచ్చు. కాలక్రమేణా కేసరిగిరి క్షేత్రం కీసరగుట్టగా రూపాంతరం చెందింది. ఈ దేవాలయం వెనుక ఒక ఏకశిలా విజయస్థూపం ఉంది. ఈ స్తంభంపై మత్స్య, కూర్మ, వరాహ, గణపతి,ఆంజనేయ విగ్రహాలు చెక్కి ఉన్నాయి.