కొల్లేరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచి నీటి సరస్సు - కొల్లేరు. ఆసియాలోనే అతిపెద్ద సహజసిద్ధమైన మంచినీటి సరస్సు ఇది. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు, ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు వలస వచ్చే పక్షులలో ముఖ్యమైనవి - పరజ, పురాజము, నులుగు పిట్ట. సైబీరియా నుండి సైతం ఇక్కడకు పక్షులు వలసవస్తూ ఉంటాయి. గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో సహజసిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుకు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు నుండే కాక డెల్టా ప్రాంతం నుండి వచ్చే అనేక కాలువలు నీటిని చేరుస్తున్నాయి. కొల్లేరు నుండి నీరు ఉప్పుటేరు అనే 62 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక వాగు ద్వారా బయటికి వెళుతుంది.
సరస్సుకు ఆగ్నేయాన ఉన్న ఈ వాగు ద్వారా నీరు బంగాళాఖాతం చేరుతుంది. కొల్లేటి సరస్సు 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.సరాసరి లోతు 0.5 నుండి 2 మీటర్ల దాకా ఉంది. కొల్లేరు సరస్సు నడిబొడ్డున ఉన్న కొల్లేరు కోట ప్రాంతాన ఉన్న ప్రసిద్ధ ఆలయం పెద్దింట్లమ్మ వారి ఆలయం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారి ఆలయంలో తొమ్మిది అడుగులపైబడి, విశాల నేత్రాలతో పద్మాసన భంగిమతో అత్యద్భుతంగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించేందుకు ఒడిషా, అసోం, తమిళనాడుల నుండి కూడా భక్తులు వస్తుంటారు. ఏటా పాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణిమ వరకూ జరిగే ఉత్సవాలలో పాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున పెద్దింట్లమ్మ సమేత జలదుర్గకు కొల్లేటి కోట సమీపాన గల గోకర్ణేశ్వరస్వామి వారికి కళ్యాణం జరిపిస్తారు.
రవాణా సౌకర్యాలు
ఆకివీడు నుండి లాంచీల ద్వారా, లేదా ఆలపాడు నుండి చిన్న రవాణా సాధనాలతో కర్రల వంతెన ద్వారా, ఏలూరు నుండి కైకలూరు మీదుగా బస్సు ద్వారా ఇక్కడికి చేరవచ్చు.