కొండపల్లి కోట
కృష్ణా జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అత్యంత కీలకమైనది ‘కొండపల్లి ఖిల్లా’ ఒకటి. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో ఉన్న కొండపల్లి ఖిల్లా నిర్మాణంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ కోట అద్భుతమైన శత్రు దుర్భేధ్యమైన కోటగా ఉండేది. 1350వ సంవత్సరంలో అనవేమారెడ్డి అనే రాజు ఓ కొండకాపరి సూచనల మేరకు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. శత్రురాజుల సైన్యాలు దండెత్తిన సమయంలో వాటి నుంచి రక్షణ కోసం 18 బురుజుల నుంచి కోట సైన్యం వారిని అడ్డుకోవటానికి ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. శత్రువులపై రాళ్ళు వేయటానికి మానవ అవసరంలేని ఓ యంత్రం కూడా ఆ రోజుల్లోనే ఉండేది.
రాజుగారి విహార మందిరం, నర్తనశాల, రాణిమహల్, రథాలు నడపటానికి అవసరమైన రహదారులు.. ఇలా ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ఈ కోటలో. అంతే కాదు..400 సంవత్సరాల చరిత్ర గల కొండపల్లి బొమ్మలు కూడా ఇక్కడ దొరుకుతాయి. అయితే కొండలో చాలా ప్రాంతాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. ఈ కోట ఎన్నో రాజ వంశాల పాలనలో ఉండేది. ఇది ఒక వ్యాపార కేంద్రంగా కూడా ఉపయోగపడింది. బ్రిటిషు పాలకులు తమ సైన్యానికి రక్షణలో శిక్షణ ఇచ్చేందుకు ఈ కోటను వాడుకునేవారు. వనవిహారానికి ఇది చాలా అనువైనది.